పూర్తి సైనిక శక్తితో విరుచుకుపడతాం

అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తుది హెచ్చరిక జారీ చేసారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా జపాన్ నుంచి మంగళవారం ఆయన దక్షిణకొరియా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే యిన్‌తో ట్రంప్ సమావేశమయ్యారు. సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఉత్తర కొరియాతో అణుయుద్ధం వస్తే పూర్తి సైనికశక్తిని వినియోగిస్తామని హెచ్చరించారు. ‘నియంత కిమ్ బెదిరింపు ధోరణిని నియంత్రించేందుకు యావత్ సైనికశక్తిని వాడతాం. బెదిరింపులకు భయపడబోం’ అని చెప్పారు. సియోల్‌కు దగ్గర్లోని ఓసాన్ ఎయిర్ బేస్‌లో తన సతీమణి మెలానియాతో కలిసి వినామం దిగిన ట్రంప్‌కు అధికారులు స్వాగతం పలికారు. హెలీకాఫ్టర్లో బయల్దేరి ఆ దేశంలోని అతిపెద్ద యూఎస్ మిలటరీ బేస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మూన్తో కలిసి అమెరికా, దక్షిణ కొరియా సైనికులతో సమావేశమయ్యారు. ఉత్తరకొరియా అంశంపై వారితో చర్చించారు.