లక్షమందికి ఐటీ శాఖ నోటీసులు .. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్


పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో

నగదు జమ చేసిన దాదాపు లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ వారంలో నోటీసులు పంపించనున్నారు. రూ.50లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసిన 70వేల మందికి మొదటగా నోటీసులు వెళ్లనున్నాయి. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 142(1) కింద ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వారి గత ప్రవర్తనను పరిశీలనలోకి తీసుకుని మరో 30వేల మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. రూ.25లక్షల నుంచి రూ.50లక్షల మధ్య నగదు డిపాజిట్లు చేసిన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగానే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఐటీ శాఖ హెచ్చరిస్తున్నది. 2016, నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఐటీ శాఖ 900 సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ.900కోట్ల ఆస్తులను సీజ్‌ చేయగా.. వాటిలో రూ.636కోట్ల నగదు కూడా ఉంది. లెక్కలు చెప్పని రూ.7,961కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు.