పోలవరం కథలో కాఫర్ డ్యామ్ పితలాటకం

 పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు అప్పుడే ప్రారంభించవద్దని కేంద్ర జలవనరులశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. దీని నిర్మాణం అసలు అవసరమో కాదో తేల్చేందుకు ఒక కమిటీ వేస్తామని పేర్కొంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ సూచనల మేరకు ఈ నిర్ణయానికి వాచినట్టు లేఖలో వివరించింది. కాపర్ డ్యామ్ పై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ)కు కూడా కేంద్రం సూచించింది. ఆ కమిటీ పోలవరం సందర్శించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. అంతవరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని పేర్కొంది. కాఫర్‌ డ్యాం అక్కర్లేదని,  ప్రధాన డ్యాం నిర్మాణం చేపట్టవచ్చని కేంద్ర జలవనరులశాఖ భావిస్తోంది. పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కూడా క్షేత్రస్థాయి అధికారులకు ఈ మేరకు పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలవరం  ప్రధాన డ్యాం 45 మీటర్లకు పైగా ఎత్తు ఉంటుంది. దీని నిర్మాణానికి ముందే ఆ పనులకు ఇబ్బంది కలగకుండా ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు రెండు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత ఎగువ డ్యాం ఎత్తు 31 మీటర్లకు ప్రతిపాదించారు. దిగువన అంతకన్నా తక్కువ ఎత్తు ఉండేలా నివేదిక సిద్ధమైంది. అప్పట్లో కేంద్ర జలసంఘమూ ఈ నివేదికను ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తును 42 మీటర్లకు పెంచుకుంటే 2018 జూన్‌ తర్వాత నీళ్లు కాలువలకు వదిలిపెట్టి నీరిచ్చాము అనిపించుకోవచ్చని  రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది.