పాకిస్థాన్, చైనాలకు షాక్ ఇచ్చిన అమెరికా


పాకిస్తాన్‌కు, చైనాకు ఏకకాలంలో అమెరికా గట్టి ఝలక్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. మసూద్‌ అజర్‌ విషయంలో పాకిస్తాన్‌కు వంతపాడుతున్న చైనాను ఈ వ్యాఖ్యలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. మసూద్‌ అజర్‌ నిస్సందేహంగా ఉగ్రవాదానికి పాల్పడ్డాడని, అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ఆమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అధికార ప్రతినిధి హార్థర్‌ న్యూర్ట్‌ స్పష్టం చేశారు. మసూద్‌ అజర్‌ విషయంలో చైనా కూడా తన వైఖరిని మార్చుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. అజర్‌ని ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే క్రమంలో చైనా దానిని పలుమార్లు వీటో చేయడాన్ని ఖండించారు. మసూద్‌ అజర్‌ని కాపాడుతున్న చర్యకు చైనా ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని ఆమె హెచ్చరించారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం మసూద్‌ అజర్‌ని, అతని సంస్థ జైషే మహమ్మద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.