రాజధానిలో అతిపెద్ద పర్యాటక కేంద్రం మెరీనా


రాజధాని అమరావతిలో ఓ పెద్ద పర్యాటక కేంద్రం రూపుదిద్దుకోనుంది.వెంకటపాలెం కృష్ణాతీరంలో బోట్లు, యాచ్‌లు వంటివి నిలిపేందుకు, సెయిలింగ్‌ వంటి కార్యకలాపాల కోసం ఉద్దేశించిన కేంద్రం ఏర్పాటవుతుంది. దేశంలోనే అతిపెద్ద మెరీనాగా తీర్చిదిద్దే ఈ కేంద్రానికి ‘కోస్టా మెరీనా’ అని పేరు పెట్టారు. నామకరణం చేశారు. దీని ఏర్పాటుకి ముంబయికి చెందిన ఓషన్‌ బ్లూ బోట్స్‌ సంస్థ సంసిద్ధమైంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమీక్షా సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు. బోటు నిర్మాణం, పడవల మరమ్మతులు, శిక్షణ కేంద్రం, పడవల విక్రయ కేంద్రాలు, లైట్‌హౌస్‌, ఫుడ్‌కోర్టులు, బీచ్‌వాలీబాల్‌ కూడా ఇక్కడ ఉంటాయి. అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీల నిర్వహణ, అత్యాధునిక బోట్లు నడపడంలో స్థానిక మత్స్యకారులకు శిక్షణ వంటి కార్యక్రమాలుంటాయి. ఇది పర్యాటక రంగ అభివృద్ధికే కాకుండా, స్థానికులకు ఉపాధి కల్పించే కేంద్రంగా కూడా తయారవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు బాధ్యతను పోర్టుల డైరెక్టర్‌కి అప్పగించారు. ఆరు నెలల్లో ఇక్కడ బోటింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల భవనాల నిర్మాణానికి ప్రజలు ఎంపిక చేసిన డిజైన్లకే పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో ఆకృతిలో భవన నిర్మాణాలు ఉండాలని స్పష్టంచేశారు. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఏఎస్‌ల బంగ్లాల డిజైన్లను అయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. వీఐపీ గృహాలను ఐదు క్లస్టర్లలో 68 టవర్లుగా నిర్మిస్తారు. మొత్తం 11 నమూనాలపై ప్రజల అభిప్రాయం కోరగా, 21 వేల మందికిపైగా స్పందించారని సీఎం తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం