హిమాచల్‌ ప్రదేశ్‌ లో సాగుతున్న పోలింగ్


himachal voters

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను (వీవీప్యాట్‌లను) ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అంటే వేసిన ఓటుకి రసీదు కూడా వస్తుందన్నమాట. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో 337 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భాజపా, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. బరిలో 62 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, 10 మంది మంత్రులు, 8 మంది ముఖ్య పార్లమెంటరీ కార్యదర్శులు, మాజీ ముఖ్యమంత్రి ప్రేంకుమార్‌ ధుమాల్‌ సహా అనేకమంది ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భాజపా, కాంగ్రెస్‌లు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీ 42 చోట్ల, సీపీఎం 14 చోట్ల పోటీలో ఉన్నాయి. 12 రోజులు సాగిన ప్రచారంలో ప్రధాన ప్రచారకర్తలు దాదాపు 450 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలనే బిజెపి ప్రచారాస్త్రంగా వాడుకుంటే, నోట్ల రద్దు, జీఎస్టీలపై కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. ఝాందూత నియోజకవర్గంలో ఇద్దరే అభ్యర్థులు బరిలో ఉంటే ధర్మశాలలో అత్యధికంగా 12 మంది పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు వీరభద్రసింగ్‌, ప్రేమ్ కుమార్ ధుమాల్‌ కూడా నియోజకవర్గాలను మార్చుకున్నారు. ఎన్నికల నిర్వహణకు 40 వేలమంది పోలీసులు, భద్రతాసిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముఖ్యాంశాలు