అందుబాటులోకి ఆటోమేటేడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌


అత్యాధునిక ఆటోమేటేడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ (ఏఎఫ్‌పీఐఎస్‌) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పరిధిలోని వేలిముద్రల విభాగానికి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల వరకూ వినియోగించిన ఫింగర్‌ ప్రింట్‌ ఆటోమేటిక్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ (ఎఫ్‌ఏసీటీఎస్‌) సాంకేతిక విధానం పాతది. ఆ స్థానంలో ఇప్పుడు ఈ కొత్త సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ సాంకేతిక విప్లవం దేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసు విభాగాల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే కొని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంతక్రితమే ఉంది. ఈ తాజా విధానంలో నిమిషాలలోనే వేలిముద్రలను సరిపోల్చి ఫలితం తెలుసుకోగలరు. ఏపీ వేలిముద్రల విభాగం ఈ విధానాన్ని గత రెండు నెలలుగా వినియోగిస్తోంది. ఈ కాలవ్యవధిలో కొన్నేళ్లుగా పరిష్కారం కానీ 1130 కేసులలోని వేలిముద్రలు ఏ నిందితులవో గుర్తించి ఆయా కేసులను పరిష్కరించారు. ఈ సాంకేతికత ఏర్పాటుకు రూ. 10 కోట్లు వ్యయమైందని అధికారులు తెలిపారు. గత ఆగస్టు 16 నుంచి ఈ విధానం అమలు చేస్తున్నామని.. ఇంతవరకూ 1411 కేసులు ఈ విధానంలో పరిష్కరించామని పోలీసు శాఖ తెలిపింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వద్ద ఏడు లక్షల ఇరవై వేల మంది నేరస్తుల వేలిముద్రల సమాచారం నిక్షిప్తం అయి ఉంది.