టాటా మోటార్స్ లాభాల బాట

టాటా మోటార్స్ లాభాల బాటలో పరుగులు తీస్తోంది. జులై- సెప్టెంబరు త్రైమాసికానికి అంచనాకు మించి లాభాలు ఆర్జించినట్టు సంస్థ ప్రకటించింది. ఏకీకృత నికర లాభం మూడింతలు (195%) పెరిగి రూ.2,502 కోట్లకు చేరింది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.848 కోట్లు. ఏకీకృత ఆదాయం కూడా 10.34 శాతం పెరిగి రూ.63,577 కోట్ల నుంచి రూ.70,156 కోట్లకు చేరింది. జాగ్వర్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) అంచనాకు మించి విజయవంతం కావడంతో లాభంలో వృద్ధి సాధ్యపడింది. ఎక్సైజ్ లాభం కింద కలిసొచ్చిన రూ.535 కోట్లు, వ్యయ నియంత్రణ చర్యలు కూడా తోడ్పడ్డాయి. ప్యాసింజర్, వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 1,52,౯౭౯ యూనిట్లు గా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 13.8% పెరిగాయి. మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 28 శాతం, చిన్న వాణిజ్య వాహన విక్రయాలు 38 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ దీనిపై మాట్లాడుతూ పునరుద్ధరణ ప్రణాళికను పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.