మన్నార్ గుడి మాఫియా పై ఐటీ ఎటాక్


మన్నార్ గుడి మాఫియాపై తమిళనాట ఆదాయ పన్ను శాఖ విరుచుకు పడింది. ఐటి అధికారుల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 చోట్ల ఈ దాడులు చేసిన విషయం తెలిసిందే. శశికళ ఆమె కుటుంబ సభ్యులు రూ. వెయ్యి కోట్ల మేర పన్ను ఎగ వేసినట్టు ఈ దాడుల్లో బయటపడింది. భారీగా నగదు, నగలు, వెండి, వజ్రాలు సైతం దొరికాయని అంటున్నారు. శశికళ, దినకరన్‌ మద్దతు దారులు ఈ దాడులు, సోదాలను వ్యతిరేకించి ఆందోళలనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్‌గుడిలో ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్‌ క్లీన్ మనీ నినాదంతో ఈ సోదాలను చేపట్టారు. శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్‌, భాస్కరన్‌, వెంకటేషన్‌, వివేక్‌, కృష్ణప్రియ తదితరులతోపాటు సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. తొలి రోజు 187 చోట్ల తనిఖీలు మొదలుపెట్టి 40 చోట్ల ముగించారు. రెండవ రోజు 147 చోట్ల సోదాలు సాగాయి. బండారం బట్టబయలు కావడంతో శశికళ, దినకరన్ మద్దతుదారులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేసారు. దీనితో పలుచోట్ల మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. రూ.1000 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన రికార్డులు, కొన్ని నకిలీ సంస్థల బ్యాంక్ పాసు పుస్తకాలు తనిఖీల్లో దొరికాయి. 317 మంది పేర్లతో వివిధ బ్యాంకుల్లో ౩౨౭ ఖాతాలు నడుస్తున్నాయని గుర్తించారు. ఈ ఖాతాల్ని తక్షణం సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పది బినామి సంస్థల వివరాలు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈడీకి కూడా పలు డాక్యుమెంట్లను అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఆయా దస్తావేజుల్లో అత్యధికం జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యలయాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. దీంతో వాటిలోని ముఖ్యుల్ని విచారించేందుకు చర్యలు తీసుకోనున్నారు. టీవీ ప్రసారాలు ఆగిపోవడంతో మీడియా స్వేచ్ఛకు భంగం అంటూ జర్నలిస్టుల సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసాయి.