హైదరాబాద్ కాప్‌ యాప్ కు అంతర్జాతీయ అవార్డు


నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న ‘హైదరాబాద్‌ కాప్‌’ యాప్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్‌ సమ్మిట్‌ అవార్డ్‌– 2017’ను ఇది గెల్చుకుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్‌ సమర్పించవచ్చని, అలా 180 దేశాలు ఎనిమిది కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపగా వాటిలో భారత్‌ నుంచి హైదరాబాద్‌ కాప్‌ నామినేట్‌ అయిందని తెలిపారు. గత వారం జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. హైదరాబాద్‌ కాప్‌ ‘గవర్నమెంట్‌ అండ్‌ సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌’కేటగిరీలో అవార్డు దక్కించుకుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపి, ప్రజలకు ఉపయుక్తంగా రూపొందిన యాప్స్‌ను ఈ వార్డుకు ఎంపిక చేస్తారని కమిషనర్‌ తెలిపారు. 2019 మార్చి 20–22 మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్‌ గ్లోబల్‌ కాంగ్రెస్‌’లో సిటీ పోలీసులు ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు.