జీఎస్టీ తగ్గింపు క్రెడిట్ కోసం కాంగ్రెస్ పాకులాట !


పలు నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసేసుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడుతోంది. 28 శాతం శ్లాబులో ఉన్న వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకురావడం తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కృషి ఫలితమే అని, ఆ క్రెడిట్ తమదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గువాహటిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం పలు వస్తువులపై శ్లాబ్ మార్పు నిర్ణయం ప్రకటించిన అనంతరమే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ ఇంకో ప్రకటన చేసారు. తాము అధికారంలోకి వస్తే గరిష్ఠ పన్ను శ్లాబును 18 శాతానికి తగ్గించేస్తామని ఆ ప్రకటన సారాంశం. జీఎస్టీని ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌’గా అభివర్ణించిన రాహుల్‌ ఆ పదాన్ని గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో బాగా ప్రచారంలో పెట్టారు. ఈ ఒత్తిడి వల్లే జీఎస్టీని తగ్గించారని ఆ పార్టీ గుజరాత్‌ ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌’ మాట గుజరాత్‌ లో వైరల్‌గా మారిందని దీనితో ఏమి చేయాలో తోచక కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించిందని కాంగ్రెస్ అంటున్నది. పెట్రోలియం, రియల్‌ ఎస్టేట్‌, ఎలక్ట్రిసిటీ వంటివి కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కూడా కాంగ్రెస్ కోరింది. మొత్తం మీద గుజరాత్‌ ఎన్నికల దృష్ట్యానే జీఎస్టీ శ్లాబ్ తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపణ.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం