పద్మావతి సినిమాపై స్టే ఇవ్వబోమన్న సుప్రీం


సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ చిత్రం విడుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ ఈ చిత్రం విడుదలకు ధ్రువపత్రం ఇచ్చే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. చిత్ర విడుదలపై స్టే కోరుతూ సిద్ధారాజ్‌సిన్హ్‌ ఎం చుడాసమతో పాటు 11 మంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంకే ఖాన్‌విల్కర్‌, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. విడుదలపై స్టే విధించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ, చిత్తోర్‌గఢ్‌ మహారాణి పద్మావతి జీవితాధారంగా పద్మావతి చిత్రాన్ని భన్సాలీ తీశారు. ఈ సినిమాలో ఖిల్జీ, పద్మావతి మధ్య అభ్యంతరకర సన్నివేశాలు ఉండకూడదని కర్ణిసేన హెచ్చరించింది. అలాంటి సన్నివేశాలు చూపిస్తే సహించేది లేదని తెలిపింది. సినిమా విడుదలకు ముందు తమకు చూపించాలని కూడా డిమాండ్‌ చేసింది. భన్సాలీ వివరణ ఇస్తూ ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, రాజ్‌పుత్‌ల గౌరవ మర్యాదలు దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తీశామని పేర్కొన్నారు. రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌ తారాగణంగా కలిగిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.