కృష్ణానదిలో బోటు బోల్తా... 23 మంది గల్లంతు

విజయవాడ : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడి ఇరవై మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 38 మంది ఉండగా, 15 మందిని రక్షణ సిబ్బంది, మత్స్యకారులు కాపాడారు. మిగిలిన వారికోసం కోసం గాలిస్తున్నారు. ఇంతవరకూ 14 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను వెలికితీశారు. సురక్షితంగా ఒడ్డుకు చేరినవారిలో 10 మంది ఒంగోలు వాసులు. కలెక్టర్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లారు. చీకటి, చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఫెర్రీ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు పర్యాటకులతో విహార యాత్రల నిర్వహణకు కొన్ని ప్రైవేటు సంస్థలు అనుమతి పొందాయి. దీంతో వేలాదిమంది నిత్యం కృష్ణానదిలో విహార యాత్రకు వస్తున్నారు. పర్యాటక సంస్థ సిబ్బంది బోటులో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లైఫ్‌జాకెట్లు ఉన్నవారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలినవారు గల్లంతయ్యారు. ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవాని ఐలాండ్ కి వెళ్లిన బోటు తిరిగి పవిత్ర సంగమం ఘాట్‌కు వస్తున్న సమయంలో ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.