ఆసియాన్ స్వర్ణోత్సవాల్లో మోదీ... దేశాధినేతలతో భేటీ


ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) స్వర్ణోత్సవాలకు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఈ వేడుకలో మోదీ భేటీ అయ్యారు. విందుకు హాజరైన నేతలిద్దరూ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. చైనా ప్రధాని లీ కెఖియాంగ్‌తోనూ మోదీ కాసేపు సంప్రదింపులు జరిపారు. జపాన్‌ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని ద్మిత్రి మెద్వెదేవ్‌, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌లతోనూ మోదీ ముచ్చటించారు. వీటి ఛాయాచిత్రాలను మోదీ ట్వీట్‌ చేశారు. వివిధ దేశాల ప్రముఖుల గౌరవార్థం ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్టె ఈ విందు ఇచ్చారు. మోదీ సహా నేతలంతా ఫిలిప్పీన్స్‌ జాతీయ దుస్తులైన ఎంబ్రాయిడరీ చొక్కా (బరోంగ్‌ తగలోంగ్‌)లను ధరించారు. 1300 మంది ప్రసిద్ధ అతిథులు హాజరైన ఈ విందులో ఫిలిప్పీన్స్‌ ప్రసిద్ధ వంటకాలను వడ్డించారు. మోదీ, ట్రంప్‌ల మధ్య ద్వైపాక్షిక భేటీ సోమవారం జరగనుంది. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత పరిస్థితులు సహా పరస్పరం ప్రయోజనకరమైన అనేక అంశాలను వారు చర్చిస్తారు. ఆసియాలో భారత్‌ కీలక భూమిక పోషించాలని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో చైనా సైనిక కార్యకలాపాలపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడితో మోదీ సోమవారం చర్చలు జరుపుతారు. కాగా మంగళవారం ఆసియాన్‌-భారత్‌ సమావేశంలో, తూర్పు ఆసియా సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచుకోవడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం చర్చకు రానున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు గురించి కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. తొలిసారి ఫిలిప్పీన్స్‌ వెళ్లిన మన ప్రధాని మోదీ అక్కడి భారతీయ సమాజం చేసే సన్మానానికి హాజరవుతారు.