కాపులు + దళితులు = పవన్ చేతికి అధికారం?


కాపుల్ని, దళితులను కలిపితే అధికారం దక్కుతుందా? ఈ రెండు వర్గాలూ జనసేనకు మద్దతు పలికితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? ప్రస్తుతం రాజకీయాల్లో కాకలు తీరిన సీనియర్ల మెదళ్లను తొలిచేస్తున్న అంశం ఇదే. ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని దాదాపు అరవై ఏళ్ల పాటు రెడ్డి, కమ్మ కులాలే పాలించాయని... ఇప్పుడు దానికి చెక్ పెడుతూ కాపులు, దళితులూ ఏకం కావాలని ప్రతిపాదిస్తూ కొత్త రసాయన ప్రక్రియకు మాజీ ఎంపీలు ముద్రగడ పద్మనాభం, జివి హర్షకుమార్, చింతా మోహన్ ప్రయత్నాలు చేపట్టారు. ఏ రెండు ప్రధాన కులాలు కలిసినా మూడో కూటమి ఏర్పాటవుతుందని నమ్ముతున్న ఈ ముగ్గురూ ఈ దిశగా పలు దఫాలు సమావేశమై చర్చించారు. దళితులను, కాపులను ఒక్కటి చేయడం కోసం వీరు పావులు కదుపుతున్నారు. ముద్రగడ గ్రామం కిర్లంపూడి వద్ద కాపుల వీధి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని వీరంతా నెలకొల్పడం వెనుక రాజకీయ తంత్రం ఇదే. అయితే దళిత, కాపు కాంబినేషన్ పై ఇప్పుడు ప్రధాన పార్టీల్లో కలవరం మొదలైంది. కులమే ఓటు బ్యాంక్ రాజకీయాలను శాసిస్తున్న నేపథ్యంలో వీరి ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివిధ సదస్సుల ద్వారా కాపుల్ని, దళితులను జాగృతం చేసుకుని అధికారంవైపు సాగాలని వీరు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోగం వెనుక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రమేయం ఉందనే సందేహాలూ కలుగుతున్నాయి! ఇప్పటివరకు హర్ష, ముద్రగడ, మోహన్ ఈ విషయం చెప్పనప్పటికీ కాపులు, దళితులను కలపడానికి బలమైన, ఆకర్షణీయమైన నాయకత్వం అవసరం కాబట్టి.. తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అభిప్రాయం వినిపిస్తోంది. యువతలో ముఖ్యంగా కాపు, దళిత యువతలో పవన్ పట్టు అసాధారణం. కాపులు ఎటూ పవన్ కళ్యాణ్ కి సహజంగా మద్దతు ఇస్తారు. ఇక దళిత కులాల్ని కలుపుకొంటే చాలనే అభిప్రాయంతో ఈ సమీకరణ సాగుతున్నదా? అనే అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సరే కానీ పవన్ కళ్యాణ్ ఈ ప్రయోగానికి సరే అంటారా అంటే సందేహమే. ఎందుకంటే ఆయన కేవలం కులబలాన్ని నమ్ముకొని రాజకీయ సమరానికి వచ్చే వ్య్తకి కాదనేది అయన సన్నిహితుల మాట. అయితే అణగారిన వర్గాలకు అధికారం అనేది సానుకూల నినాదమే కనుక పవన్ ని ఈ ప్రయోగానికి ఒప్పించగలమని కొందరు కాపు నాయకులు ఆశాభావంతో ఉన్నారని సమాచారం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం