నంబూరులో బాలోత్సవ్ ఘనంగా ప్రారంభం


అమరావతి సమీపంలోని నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌(వీవీఐటీ) లో మూడు రోజుల బాలోత్సవ్‌ కార్యక్రమం ఆదివారం వేల మంది చిన్నారుల సందడి నడుమ ప్రారంభమైంది. నవ్యాంధ్రలో తొలిసారిగా ‘బాలోత్సవ్‌-2017’ వేడుకగా జరిగింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల తోడుగా పాఠశాల విద్యార్థులు పంచెకట్టు, లంగా ఓణీలు ధరించి వచ్చి ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి బాల, బాలికలు బాలోత్సవ్ కి హాజరయ్యారు. , సంప్రదాయాలు, కళల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ప్రదర్శనలు, నాటికలు, విచిత్ర వేషధారణలు అలరించాయి. 25 ఏళ్ల పాటు కొత్తగూడెం కేంద్రంగా కొనసాగుతున్న బాలోత్సవానికి నిరుడు విరామం రాగా అందుకు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ లో దీని నిర్వహణకు సంకల్పించడంపై ప్రశంసలు మిన్నంటాయి. తొలి ఏడాదే జాతీయ పండగగా ఇది వైభవంగా జరగడం ఆనందకరమని బాలోత్సవ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు అన్నారు. ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్నారి దశలోనే కళలు, సంప్రదాయాలపై మక్కువను కలిగి ఉండాలని సూచించారు. నాగార్జునవర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను సమయస్ఫూర్తితో స్వయంగా పరిష్కరించుకునేలా కళల ద్వారా నేర్పించాలన్నారు. ప్రవాసాంధ్రుల సంఘం సలహాదారు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో కళలు అంతర్భాగం కావాలన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ సాంబశివరావు , ఏపీ సాంస్కృతికశాఖ సంచాలకులు విజయభాస్కర్‌, బాలోత్సవ్‌ కన్వీనర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, విద్యావేత్త మంగాదేవి తదితరులు ప్రసంగించారు. జానపద నృత్యం, కూచిపూడి నాటికలు, మానవుడి వేషధారణలు, పలు నాటికలు, తెలుగు కథారచనలు, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ముఖ్యాంశాలు