న్యాయం చేస్తే ఏ పార్టీకైనా కృతజ్ఞతతో ఉంటాం


మండపేట : అన్యాయం జరిగిందనుకున్నప్పుడు కాపులంతా ఎలా ఐక్యంగా స్పందిస్తారో అదే రీతిగా కాపుకులానికి న్యాయం చేకూరిందనుకుంటే కాపులు ఏపార్టీనైనా నెత్తిన పెట్టుకుని పూజిస్తారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సాయం పొందినపుడు కృతజ్ఞతాభావంతో కట్టుబడి వుండే కులం కాపు కులమని స్పష్టం చేశారు. యువత దేశంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నతమైన విద్యావంతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సుఖసంతోషాలతో ఉన్నప్పుడు మర్చిపోయినా పర్వాలేదు, జిల్లాలో ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా నేను ఉన్నానని మాత్రం మరువొద్దని ఆయన ప్రసంగంలో అభిమానులకు భరోసానిచ్చారు. ఆయన నింపిన జోష్ కు కాపు యువత కేరింతలు, హర్షద్వానాల నడుమ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. తనకు జిల్లాలోనే కాదు రాష్ట్రమంతటా అభిమానులున్నారని స్పష్ట పరిచారు. తనపై ఉన్న అభిమానంతో నాలుగు పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని అన్నారు. కాపు కార్తీక వనసమారాధనకి ఎమ్మెల్యే తోట ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కాపు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఏడిద రోడ్డులోని జొన్నల వెంకటేశ్వర్రావు గోదాములు శ్రీకృష్ణదేవరాయ ప్రాంగణంలో ఆదివారం వనసమారాధనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాపుసంఘం ప్రెసిడెంటు జిన్నూరి సాయిబాబా అధ్యక్షత వహించారు. జిల్లా ,నియోజకవర్గం నలుమూలలనుండి సుమారు 15 వేల మంది కాపు కులస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని సంఘం తెలిపింది. యువతకోసం ఏర్పాటు చేసిన సినీ గేయాలాపన అలరించింది. కార్యక్రమంలో వేలాది మంది కాపు యువత , మహిళలు , నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం