ఫిలిప్పీన్స్ లో మోదీ పేరిట ప్రయోగశాల

లోగడ ఇజ్రాయెల్ లో ఒక పుష్పానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టిన వార్త తెలిసిందే. ఇపుడు తాజాగా ఫిలిప్పీన్స్ లో ఒక వ్యవసాయ సంబంధిత ప్రయోగ శాలకి మోదీ పేరు పెట్టారు. ఆసియన్ సదస్సు కోసం మనీలాలో ఉన్న మోదీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్టెతో కలసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఫిలిప్పీన్స్‌లో మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న జైపూర్ కృత్రిమ పాదాల శిబిరాన్ని మోదీ సందర్శించారు. ఫిలిప్పీన్స్‌లోని లాస్బానోస్లో ఉన్న అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రాన్ని మోదీ సందర్శించారు. భారత్‌కు చెందిన రెండు వరి వంగడాలను జన్యు బ్యాంకుకి అందజేశారు. భారతీయ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. వరదనీటిలో మునిగి ఉన్నా తట్టుకోగలిగే వరి రకాలను గురించి ఆ శాస్త్రవేత్తలు వివరించారు. అనంతరం తన పేరిట ఏర్పాటుచేసిన ప్రయోగశాలను మోదీ ప్రారంభించారు. 21వ శతాబ్దంలో భారతదేశం అన్ని రంగాల్లో రాణించేలా భారతీయులంతా కష్టపడి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఒకసారి ఈ ఇబ్బందుల్ని అధిగమించాక సమున్నత శిఖరాలను చేరుకోవడంలో భారత్‌ను ఎవరూ ఆపలేరన్నారు. ఫిలిప్పీన్స్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి 35 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. ఒక సింగపూర్, ఒక ఫిలిప్పీన్స్ శుభ్రంగా ఉన్నట్లు భారత్ ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.