123 విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా రద్దు


దేశవ్యాప్తంగా 123 విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదాను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంస్థల పేరు చివర ఇకపై యూనివర్సిటీ అనే పదం ఉంచరాదని ఆదేశించింది. కొత్త పేరు కోసం ఈ సంస్థలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దూరవిద్య విధానం ద్వారా 4 విద్యాసంస్థలు జారీ చేసిన ఇంజినీరింగ్‌ పట్టాలను కూడా యూజీసీ రద్దు చేసింది. యూజీసీ ప్రకటించిన 123 విద్యాసంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లో నడుస్తున్న ఐదు ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. విశాఖపట్నంలోని గాంధీ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం యూనివర్సిటీ), గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (కేఎల్‌ యూనివర్సిటీ), తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అనంతపురంలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌, గుంటూరులోని విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌(విట్‌) వీటిలో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆయా యూనివర్సిటీలు జారీ చేసిన పట్టాలు, ధ్రువీకరణ పత్రాలకు మాత్రం ఏ ఇబ్బంది ఉండదని, పేరు మాత్రమే మార్చుకోవాలని యూజీసీ తెలిపింది.