ఇంటర్ పరీక్షలు .. ఆంధ్ర, తెలంగాణ ఒకటే టైం టేబుల్


తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల కాలపట్టిక మారింది. మార్చి 1వ తేదీ నుంచి కాకుండా ఫిబ్రవరి 28 నుంచే పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 19 కి ముగుస్తాయి. వారం క్రితం మార్చి 1 నుంచి 20వ తేదీవరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌బోర్డు ప్రకటించడం తెలిసిందే. అప్పటికే ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీవరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రశ్నపత్రాలపై ఏపీ లేదా తెలంగాణ అని ఉండదు కాబట్టి.. ప్రశ్నపత్రం లీకయిందంటూ వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగే అవకాశం ఉండటంతో అధికారులు పునరాలోచించారు. రెండు రాష్ట్రాల్లో సిలబస్‌ ఒకటే కాబట్టి ఒకే ప్రశ్నలు కొన్ని వచ్చినా సమస్యలు ఎదురవుతాయని తెలంగాణ ఇంటర్‌బోర్డు భావించింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల్లో ఒకే టైం టేబుల్ ఉంటె మంచిదని భావించి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు మార్చి 14వ తేదీతోనే పరీక్షలు ముగుస్తాయి. ఇంటర్‌, ఒకేషనల్‌ సైన్స్‌ కోర్సుల వారికి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక తప్పనిసరిగా రాయాల్సిన నైతికత, మానవీయ విలువల పరీక్ష జనవరి 27న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 29న ఉంటాయి. రెండు పరీక్షలనూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.