జింబాబ్వే లో ఏం జరుగుతోంది?

జింబాబ్వే సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందా? అలాంటివార్తలే ప్రపంచం అంతా గుప్పుమంటున్నాయి. అయితే జింబాబ్వే సైన్యం దీనిని ఖండిస్తూ ఓ వివరణ ఇచ్చింది. తాము తిరుగుబాటుకు ప్రయత్నించలేదని బుధవారం ఉదయం స్థానిక అధికారిక మీడియాలో సైన్యం ప్రకటించింది. కానీ అక్కడ సైనిక చర్య చేపట్టిన విషయాన్ని మాత్రం ధృవీకరించింది. తమ చర్య అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పట్ల అవిధేయత,తిరుగుబాటు కాదని, అధ్యక్షుని చుట్టూ ఉన్న నేరస్తులను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వివరించింది. ప్రభుత్వాన్ని సైన్యం తన చేతుల్లోకి తీసుకున్నట్టు కూడా కాదని ఆర్మీ స్పష్టం చేసింది. అధ్యక్షుడు ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉందని, వారికీ సైన్యం రక్షణ కల్పిస్తున్నదని పేర్కొంది. అధ్యక్షుడి వెంట ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు సైన్యం గురి పెట్టిందని.. ఆ లక్ష్యాన్ని సాధించిన వెంటనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని స్పష్టం చేసింది. అసలు సైనిక తిరుగుబాటు విషయం ఎలా వెలుగు చూసిందంటే .. మంగళవారం అధ్యక్షుడి ప్రైవేటు నివాసాన్ని సైనిక వాహనాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో అధ్యక్షుని భద్రతా సిబ్బందికి, సైన్యానికి మధ్య కాల్పులు కూడా జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అధ్యక్షుడిపై సైన్యం తిరుగుబాటు వార్తలు గుప్పుమన్నాయి. బ్రిటన్ నుంచి జింబాబ్వేకి 1980 లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పటినుంచీ ఆ దేశాన్ని రాబర్ట్ ముగాబే పరిపాలిస్తున్నారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. కాగా ఈమధ్య అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఆయన పార్టీలోనే అసమ్మతి నేతలు ముగాబే పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన తరుణంలో సైనిక చర్య అంశం అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది.