రుద్రమదేవి తీసినందుకు క్షమించండి : గుణశేఖర్


రుద్రమదేవి వంటి గొప్పచరిత్రాత్మకచిత్రానికి కనీసం ఒక చిన్న గుర్తింపు కూడా ఇవ్వని నంది అవార్డుల జ్యురీ కి బుద్ధొచ్చేలా ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ ఓ ప్రకటన జరీ చేసారు. ఇలాంటి చిత్రాన్ని తీసినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి నంది అవార్డు ఎందుకు ప్రకటించలేదని దర్శకుడు గుణశేఖర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటించిన 2014, 15, 16 సంవత్సరాల అవార్డుల విషయంలో ఎవరు ఎదురు ప్రశ్నించినా వాళ్లని వచ్చే మూడేళ్ల పాటు అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారట! అసలు మనం ఏ దేశంలో ఉన్నాం? స్వతంత్ర భారతంలోనేనా? అని ఆయన ఆగ్రహంతో ప్రశ్నించారు. మహిళా సాధికారతని,దేశభక్తిని చాటి చెప్పే ‘రుద్రమదేవి’ ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. మర్చిపోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి సినిమా తీసి గుర్తు చేశాడు.... మళ్లీ ఇప్పుడు అవార్డులిచ్చి ప్రజలకి ఆ చరిత్రను గుర్తుచేయడం ఎందుకనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారా? అదే అయితే ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’ అని గుణశేఖర్‌ ఆప్రకటనలో వ్యాఖ్యానించారు.