సాగు రంగం రూపురేఖలు మార్చాలి : ఉపరాష్ట్రపతి


భారత వ్యవసాయరంగం రూపురేఖల్ని మార్చకపోతే రైతులు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు వలస పోతారని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హెచ్చరించారు. బుధవారం విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య, డాల్బెర్గ్‌, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘ఎ.పి. అగ్రిటెక్‌ సమ్మిట్‌-2017’లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొత్త ఆలోచనలు, అధునాతన పరిజ్ఞానం కోసం సాగు రంగం ఎదురు చూస్తోందని అయన అన్నారు. వాతావరణ ఇబ్బందులు, కరవుకాటకాలు, చీడపీడలు, దళారులు, మార్కెట్‌ ప్రతికూలతలు తట్టుకొని లాభపడడం రైతుకు కష్టంగా మారిందన్నారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పంటల ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి వసతులపై 1977లో మొరార్జీదేశాయ్‌ చేసిన సూచనలు నేటికీ అమలు కాలేదని వాపోయారు. రైతులు సాగుతో పాటు పశుపోషణ, కోళ్లపెంపకం తదితరాలను కూడా అవలంబిస్తే ఆత్మహత్యల దుస్థితి తలెత్తదన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ‘ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌-2017’ పేరిట సమావేశాన్ని నిర్వహించడం దేశంలోనే తొలిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ (బీఎంజీఎఫ్‌) సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ముగింపు కార్యక్రమానికి శుక్రవారం బిల్‌గేట్స్‌ వస్తున్నారని చెప్పారు. అగ్రిటెక్‌ సదస్సు భారత వ్యవసాయరంగ ప్రగతిలో కీలక మలుపని బీఎంజీఎఫ్‌ ఆసియా వ్యవసాయ విభాగం అధిపతి పూర్వీ మెహతా పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు శోభనా కామినేని మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిపుష్ఠం చేసేలా వివిధ రంగాలతో సమావేశాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.