గుజరాత్ లో బిజెపి అభ్యర్థుల తొలి జాబితా


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 70మంది పేర్లతో ఈ జాబితా విడుదలైంది. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ తదితరులకు ఇందులో స్థానాలు ఖరారయ్యాయి. పశ్చిమ రాజ్‌కోట్‌ నుంచి రూపానీ పోటీ చేస్తున్నారు. నితిన్‌ పటేల్‌ మెహసన నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు జీతు వాఘాని భావనగర్‌ వెస్ట్‌ నుంచి పోటీ చేస్తారు. ఇంకో 112 స్థానాలకు అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గుజరాత్ శాసన సభలో మొత్తం ఎమ్మెల్యేలసంఖ్య 182. డిసెంబర్‌ నెలలో రెండు విడతల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 9, 14 తేదీల్లో పోలింగ్‌ జరిగి, 18న ఫలితాలు వెల్లడి అవుతాయి. భాజపా నుంచి అమిత్‌షా, కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తున్నారు. నవంబర్‌ 18 నుంచి ప్రధాని మోదీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది.

ముఖ్యాంశాలు