భారత్ కు పెరిగిన అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్


అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ సంస్థ భారత సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ను 13 ఏళ్ల తర్వాత ఇపుడు మళ్ళీ అప్ గ్రేడ్ చేసింది . దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత కొన్నేళ్లుగా భారత్‌ తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలకు అంతర్జాతీయ గుర్తింపు. భారతదేశ ఆర్థికవ్యవస్థ మెరుగుదలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. గత మూడు నాలుగేళ్లలో భారత్‌ తీసుకొచ్చిన అనేక సంస్కరణలకు అంతర్జాతీయంగా లభించిన ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు.‘పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ), ఆధార్‌ లింకేజి అమలు వంటి కీలక నిర్ణయాల వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు డిజిటలైజేషన్‌ వైపు మళ్లించగలిగామని చెప్పారు. దీన్ని ప్రపంచం ఇపుడు గుర్తించిందన్నారు. సంస్కరణలపై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని జైట్లీ చెప్పారు. భారత చరిత్రలోనే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి మా మూడేళ్ల ట్రాక్‌ రికార్డు ఓ మైలు రాయి అని స్పష్టం చేసారు. అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ భారత సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కి సవరించింది.13ఏళ్ల ఏళ్లలో భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం ఇదే తొలిసారి. అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 13ఏళ్ల క్రితం మూడీస్‌ భారత్‌కు బీఏఏ3 రేటింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెంచింది. ఈ రేటింగ్ వలన కార్పొరేట్ రంగానికి, ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రాజెక్టులు, రుణ సహాయం సులువుగా, చవకగా పొందడం సాధ్యమవుతుంది.

ముఖ్యాంశాలు