భార్యకు పట్టం కట్టబోయి... ఖైదులో పడిన ముగాబే


ప్రపంచంలో ఎక్కువకాలం ఒక దేశాన్ని పాలించిన వ్యక్తి ఎవరంటే ఠక్కున చెప్పొచ్చు... రాబర్ట్ ముగాబే అని. అలంటి శక్తిమంతమైన, ప్రజాభిమానం కలిగిన నేత ఇపుడు చతికిలబడ్డారు. అయన జింబాబ్వే ను ఏకంగా 37ఏళ్లపాటు అధ్యక్షునిగా పాలించారు. ఇప్పుడాయన వయసు 90 ప్లస్. 1996లో ముగాబే గ్రేస్‌ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 31 , ముగాబే వయసు సుమారు 70. క్రమంగా గ్రేస్ పార్టీపై, ప్రభుత్వంపై పట్టు బిగించి.. ముగాబే తదుపరి అధ్యక్షురాలు కావాలని కలలు గన్నారు. తన అనుయాయులకు కీలక పదవులు కట్టబెట్టారు. ముగాబే ను కీలుబొమ్మను చేసి తన ఆట మొదలెట్టారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె ప్రమేయాన్ని ఉపాధ్యక్షుడు ఎమ్నంగగ్వా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జింబాబ్వే లోసంక్షోభం రాజ్యమేలుతోంది. సైన్యం అధ్యక్షుడిని, అయన కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసింది. పరిస్థితులు చక్కబడిన తరవాత మళ్ళీ ప్రజా పాలకులకు అధికారం అప్పగిస్తామని సైన్యాధిపతి జనరల్‌ కాన్‌స్టెంటినొ చివెంగా అంటున్నారు. తమ పోరాటం అధ్యక్షుడు ముగాబే పై కాదని.. ఆయన చుట్టూ ఉన్ననేరస్తులపైనే అని సైన్యం అంటున్నది.బ్రిటిష్‌ పాలననుంచి జింబాబ్వేని విముక్తం చేసిన పోరాట యోధునిగా ముగాబే ప్రసిద్ధుడు. జింబాబ్వేను గతంలో దక్షిణ రొడీషియాగా పిలిచే వారు. బ్రిటిష్‌ పాలన నుంచి స్వేచ్ఛ కోసం ముగాబే స్వదేశంలో, విదేశాల్లో మడమ తిప్పని యోధుడిగా పోరాడారు. 1963 నుంచి 1975 వరకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను జైల్లో బంధించినా ఆయన పట్టు వీడలేదు. ఎట్టకేలకు బ్రిటిష్‌ పాలకులు దిగివచ్చి స్వతంత్రం ప్రకటించారు. దేశ తొలి అధినేతగా 1980 ఏప్రిల్‌ 17న ముగాబే ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన పార్టీ జింబాబ్వే ఆఫ్రికన్‌ పీపుల్స్‌ యూనియన్‌ విజయపరంపర కొనసాగింది. 2013 చివరి ఎన్నికల్లో కూడా 210 స్థానాల్లో 137 స్థానాల్లో ఆయన పార్టీ గెలిచింది. అయితే జింబాబ్వే పరిస్థితి వేగంగా తిరోగమిస్తోంది. ద్రవ్యోల్బణం చుక్కలు తాకింది. ధరలు పెరిగి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాగునీరు, విద్యుత్‌ కొరతతో జనం అలమటిస్తున్నారు. కొలువులు లేక పొరుగు దేశాలకు వలసలు పరిగాయి. 76శాతం ప్రజలు రోజుకు 1.25 డాలర్‌ సంపాదనతోనే జీవిస్తున్నారు. 1,370 కోట్ల డాలర్ల అప్పు. 1.61 కోట్ల జనాభా, 3.90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల దేశం జింబాబ్వే. ఈనెల ఆరో తేదీన ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ ఎమ్నంగగ్వాను తొలగించి తన భార్య గ్రేస్‌ ముగాబేను పీఠంపై కూర్చోబెట్టాలని పావులు కదిపారు. అయితే ఇక్కడే పరిస్థితిని అంచనా వేయడంలో ముగాబే విఫలం అయ్యారు. గ్రేస్‌కు ప్రజాదరణ లేకపోగా తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ , సైన్యం ఆయనను వ్యతిరేకించాయి.