పద్మావతికి సర్టిఫికెట్ ఇవ్వని సీబీఎఫ్సీ

పద్మావతి చిత్రానికి సీబీఎఫ్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వెనక్కి పంపించిందని సమాచారం. దరఖాస్తులోని కొన్ని ఖాళీలను నిర్మాతలు పూరించకపోవడంతో ఈ చర్య తీసుకున్నా రని అంటున్నారు. దీంతో ఈ సినిమా సర్టిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు. గత వారమే చిత్రాన్ని సెన్సార్ కోసం పంపించారు. దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ ప్రధాన తారాగణంగా ‘పద్మావతి’ని సంజయ్‌లీలా భన్సాలీ తెరకు ఎక్కించారు. రాజ్‌ఫుత్ మహారాణి ‘పద్మావతి’ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ప్రకటించారు. ‘పద్మావతి’ గురించి సినిమాలో తప్పుగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డిసెంబరు 1న ‘పద్మావతి’ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫికేషన్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తల హెచ్చరికలు ఖాతరు చేయకుండా హీరోయిన్ దీపిక ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.