తలసరి స్థూల జాతీయోత్పత్తి లో 126 వ స్థానంలో భారత్


భారత్‌ వృద్ధి దేశంలోని కొంతమందికి కనిపించకపోయినా అంతర్జాతీయంగా గణాంకాలరూపంలో బాగానే వ్యక్తం అవుతోంది. అమెరికా, చైనా వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు దీటుగా భారత్ ఎదుగుతోంది. సులభతర వ్యాపారంలో 100వ స్థానంలో నిలిచిన భారత్‌ తాజాగా తలసరి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) గణాంకాల ప్రకారం టాప్‌ 200 దేశాల్లో 126వ స్థానంలో నిలిచింది. అయితే బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే ఇంకా భారత్ వెనుకబడే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గణాంకాల ప్రకారం అత్యంత ధనిక దేశంగా ఖతార్‌ నిలిచింది. కొనుగోలు శక్తి ప్రాధాన్యం(పీపీపీ) ఆధారంగా ఐఎంఎఫ్‌ జీడీపీని గణించింది. గతేడాది భారత తలసరి జీడీపీ 6,690 డాలర్లు ఉండగా, తాజాగా 7,170 డాలర్లకు చేరడం ద్వారా భారత ర్యాంకు మెరుగుపడింది. ఇదే సమయంలో ఖతార్‌ తలసరి జీడీపీ 1,24,930 డాలర్లతో మొదటిస్థానంలో, మకావు 1,14,430 డాలర్లతో రెండో స్థానంలోనూ ఉండగా, లక్సెమ్‌బర్గ్‌ 1,09,190 డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. బ్రిక్స్‌ దేశాల్లో భారత్‌దే అతి తక్కువ తలసరి జీడీపీ. రష్యా తలసరి జీడీపీ 27,900 డాలర్లు, చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్‌ 15,550 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,400 డాలర్లతో ఉన్నాయి. క్రెడిట్‌ స్యుసి నివేదిక ప్రకారం భారత్‌లో 2.45లక్షల మంది మిలియనీర్ల మొత్తం సంపద 5 ట్రిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.ఐఎంఎఫ్‌ విడుదల చేసిన తలసరి జీడీపీ గణాంకాల ప్రకారం సింగపూర్‌(4), బ్రూనే(5), ఐర్లాండ్‌(6), నార్వే(7), కువైట్‌(8), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(9), స్విట్జర్లాండ్‌(10)లు టాప్‌ టెన్‌లో నిలిచాయి.

ముఖ్యాంశాలు