కాంగ్రెస్ - పాస్ పొత్తు ఫలిస్తుందా?

కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఇప్పటిదాకా మద్దతిచ్చిన పటేల్ వర్గీయులు ఇపుడు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) మధ్య సీట్ల ఒప్పందంలో తలెత్తిన భేదాభిప్రాయాలే ఇందుకు కారణం. హార్దిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్న పాస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. స్థానాల కేటాయింపుపై విస్తృత చర్చలు జరిగాయి. ఒక అంగీకారానికి వ్ చ్చిన తర్వాత కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 77 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు హార్దిక్ సన్నిహితులకు టికెట్లు ఇచ్చారు. అయితే తమ అంచనాల మేరకు సీట్లు కేటాయించలేదని, తమను సంప్రదించకుండానే అభ్యర్థులను పలు సీట్లకు ఖరారు చేసుకున్నారని పాటిదార్ ఆందోళన్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పాస్ సభ్యులు కొందరు ఆదివారం రాత్రి సూరత్‌లోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి కూడా చేశారు. సూరత్‌లోనే గాక.. అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ పటేల్ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు.