రాష్ట్రపతి అరుణాచల్ పర్యటనపై కస్సుమన్న డ్రాగన్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ పై కస్సుబుస్సులాడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను సంక్లిష్టం చేసేలా భారత్‌ వ్యవహరిస్తోందని మండిపడింది. కోవింద్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం పర్యటించారు అరుణాచల్‌ప్రదేశ్‌గా పిలవబడే ప్రాంతాన్ని తాము స్పష్టంగా ధ్రువీకరించలేదని, సరిహద్దు అంశంపై తాము స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్‌ మీడియాతో అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌ ప్రాంతంగా చైనా భావిస్తోందని అయన స్పష్టం చేసారు. అయితే, భారత్‌ ఎప్పటికప్పుడు అరుణాచల్  విషయంలో చైనా అభ్యంతరాలను తిప్పికొడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగం అని, దేశ నాయకులు ఆ ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లవచ్చని స్పష్టం చేస్తోంది. నవంబర్‌ 6న కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో పర్యటించిన సందర్భంలోనూ, అంతకుముందు భారత అతిథిగా దలైలామా పర్యటించిన సందర్భంగానూ చైనా అభ్యంతరాలు వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల ప్రతినిధులు 19సార్లు చర్చించారు. 20వ రౌండ్‌ చర్చలు దిల్లీలో డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.