"కంద" రాజ్యంలో కార్తిక కళోదయం !

కడియం మండలంలో పూదోటల పరిమళాల తో పరవశించే ఓ అందాల గ్రామం దుళ్ల. ఆ గ్రామంలో అనేక ఎకరాలు విస్తరించిన అరటి, కంద తోటల సుక్షేత్రం! ఆ పంటభూమిలో 19 వ తేదీ ఆదివారం నాడు కార్తీక వనసమారాధన అత్యంత వినూత్నంగా.. ఆద్యంతం ఆత్మీయంగా సాగింది. ఆహూతులకు చిరస్మరణీయ స్మృతిని మిగిల్చింది. కంద రెడ్డి గా అందరికీ సుపరిచితులైన సత్తి భాస్కరరెడ్డి రాజమహేంద్రవరం లోని కొందరు కవులు, కళాకారులు, రచయితలకు కుటుంబ సమేతంగా తమ పొలంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. కులాలు, రాజకీయ పార్టీలు, వర్గాల వారీగా కార్తీక సమారాధనలు జరుగుతున్నా ప్రస్తుత తరుణంలో కళాభిమానిగా, కళాపోషకునిగా కంద రెడ్డి చేసిన ఈ వినూత్న ప్రయోగం కవి పండితుల ప్రశంసలు అందుకుంది. అరిటాకులో రుచి, శుచి సమపాళ్ళుగా అమరిన ఘుమఘుమలాడే వంటకాలను కొసరి కొసరి వడ్డించి పల్లెటూరి అభిమానం ఎలా ఉంటుందో చూపించారు. ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానించి, ఆదరించి పెద్ద మనసును ప్రదర్శించారు. పాలేరు స్థాయి నుంచి కౌలు రైతుగా, సుక్షేత్రాల భూస్వామిగా ఎదిగిన తన జీవన ప్రస్థానాన్ని కందరెడ్డి వివరిస్తుంటే శ్రోతల హృదయం ఉద్విగ్నమైంది. ప్రజాపత్రిక సంపాదకులు దేవి సుదర్శన్ సంచాలకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కళాగౌతమి వ్యవస్థాపకులు బివిఎస్ మూర్తి, బహుభాషా రచయిత మహీధర రామశాస్త్రి, కవి ఖాదర్ ఖాన్, నఖ చిత్రకారుడు రవి పరస, జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం, బివి రాఘవరావు, దూడల అర్జున్, సాహితీవేత్త ఫణి నాగేశ్వరరావు, చిత్రకారుడు తాడోజు హరికృష్ణ, కవులు నూజెళ్ళ సూరిబాబు, యార్లగడ్డ మోహనరావు, నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు. కందరెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మీ సువర్చల, కుమార్తె భవాని తదితరులు కవి రచయితలకు ఆహ్వానం పలికారు. శ్రమయేవ జయతే అన్న ఆర్యోక్తికి, దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన కంద రెడ్డి ని సతీ సమేతంగా కవి పండితుల పక్షాన సుదర్శన్, ఖాదర్ ఖాన్, బివిఎస్ మూర్తి తదితరులు సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

ముఖ్యాంశాలు