గుజరాత్ రూపురేఖలు...పార్టీల భాగ్యరేఖలు


నరేంద్ర మోదీ ప్రత్యక్షపాత్ర లేకుండా పదిహేనేళ్ల తరవాత గుజరాత్ లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు... అయితే నరేంద్ర మోదీ ఇక్కడ నేరుగా బరిలో లేరన్న మాటే గానీ ఆయన పనితీరుకు గుజరాతీలు వేసే మార్కులుగానే ఈ ఎన్నికలను పరిగణించాలి. మూడున్నరేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రధాని అయ్యాకా గుజరాత్‌ సీఎంగా ఆనందీబెన్‌ పటేల్‌ బాధ్యతలు చేపట్టారు.అయితే మోదీ వంటి మేరు నగం తర్వాత సీఎం పదవి చేపట్టడం అతి పెద్ద సవాల్.. అందులో ఆమె కొంత వెనుకబడడంతో కొంతకాలానికి ఆమె స్థానంలో 2016ఆగస్టు 7న విజయ్‌ రూపాని ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత గుజరాత్‌ భాజపాలో ఒక రకమైన నాయకత్వ శూన్యత తలెత్తి కాంగ్రెస్ కి బలాన్ని పెంచింది. రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ లబ్ధి పొందడం ఈ కారణంగానే. భాజపా, కాంగ్రెస్‌ రెండూ ఉపాధి, అభివృద్ధి నినాదాలనే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే కాంగ్రెస్ ఆశలన్నీ. మోదీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల్లో ఇపుడు వచ్చిన చీలికలు భాజపాకి ఆందోళనకరం. అలాగని కాంగ్రెస్‌ పరిస్థితీ ఏం బాగోలేదు. అందుకే గుజరాత్ ఎన్నికలు ఈసారి అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఇరు పార్టీలు కూడా గ్రామీణ ఓటర్లను దృష్టిలో పెట్టుకున్నాయి. గుజరాత్‌ ప్రభుత్వం బిందు సేద్యంపరికరాలపై జీఎస్‌టీ మినహాయించింది. మూడు లక్షల వరకూ రైతు రుణాలను వడ్డీరహితం చేసింది. క్వింటా పత్తి కొనుగోలుపై రూ.500 బోనస్‌ ఇచ్చింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవసాయ స్థూలోత్పత్తి సగటు 2002-14 మధ్య ఎనిమిది శాతం ఉంది. ఆ కాలంలో జాతీయ సేద్య స్థూలోత్పత్తి సగటు 3.3 శాతమే. అయితే మోదీ తర్వాత వ్యవసాయ వృద్ధి గుజరాత్‌లో తగ్గుతూ వచ్చింది. 2014-’15 మధ్య వర్షాలు సరిగ్గా కురవకపోవడంవల్ల రైతుల సమస్యలు పెరిగాయి. 2016-’17లో వర్షాలు కురిసినా వేరుశెనగ, ఇతర పంటల దిగుబడి పెరిగి ధరలు పడిపోయాయి. పత్తికి మద్దతు ధర బాగానే ఉన్నా సేకరణ సమస్యల కారణంగా రైతులు ఇబ్బందిపడ్డారు. 1980లో క్షత్రియ, హరిజన్‌, ఆదివాసులు, ముస్లిములను ‘ఖామ్‌’ (కేహెచ్‌ఏఎం) పేరిట కాంగ్రెస్ఒ ఏకతాటిపైకి తెచ్చి 180కిగాను 141 స్థానాల్లో (స్థానిక సంస్థలు) విజయం సాధించింది. అయితే ఆనాడు పాటీదారులు భాజపా పక్షాన చేరారు. ‘ఖామ్‌’ వర్గాలను ఇపుడు కూడా తన చేతుల్లో ఉంచుకోవాలని, పాటీదారులతో జట్టుకట్టి విజయం సాధించాలని కాంగ్రెస్‌ ఆశ. అయితే ఏనాడూ కాంగ్రెస్‌ పొడగిట్టని పాటీదారులు ఆ పార్టీవైపు ఏ మేరకు మొగ్గుతారో తేలాల్సి ఉంది. పాటీదారులకు ఓబీసీ కోటాను వ్యతిరేకించిన బిసి నాయకుడు అల్పేష్‌ థకోర్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఇది సహజంగానే పాటీదారులకు గిట్టలేదు. తొలి విడత సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం లేదని కాంగ్రెస్ పై వారు ఆగ్రహంగా ఉన్నారు. హార్దిక్‌ పటేల్‌ ‘సెక్స్‌ టేపుల’ విడుదలతో పరిణామాలు మారిపోయాయి. పాటీదారులు తిరిగి భాజపా గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులకు సీట్లు ఇచ్చి భాజపా తెలివిగా వ్యవహరించింది. వ్యవస్థీకృత నిర్మాణం లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం కాంగ్రెస్ బలహీనతలు. రాహుల్‌ గాంధీ సభలకు జనం బాగానే వచ్చినా ఆ మద్దతును కట్టి ఉంచగల కార్యకర్తల దన్ను కానరావడంలేదు. ఆకర్షణ ఉన్న నాయకులెవరూ కాంగ్రెస్‌లో లేరు. థకోర్‌, మెవానీ, పటేల్‌ సామాజిక వర్గాలపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకొంది. గుజరాత్‌ ఎన్నికల్లో గత ఇరవై ఏళ్ళనుంచీ మతానిది కీలక పాత్ర. అందుకే ఎన్నికల ప్రచారంలో ప్రతి చోటా రాహుల్ గాంధీ దేవాలయాలను సందర్శించా రు. హిందూ ఓట్లను ఆకర్షించడం కోసం ఈయన ఈపని చేస్తే తొలుత ఆయన హిందువా, క్రిస్టియనా అన్న విషయం తేల్చాలని బిజెపి వారు ఇరకాటంలో పడేశారు. ఈ వాదన అంతిమంగా భాజపాకే లబ్ధి కలిగిస్తుంది. సంఘ్‌ పరివార్‌ బలంగా ఉన్న గుజరాత్‌లో రాహుల్‌ గిమ్మిక్కులు ఫలించడం అనుమానమే. కాంగ్రెస్‌లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడైన శంకర్‌సింగ్‌ వాఘేలా జన్‌ వికల్ప్‌ పేరిట కొత్త పార్టీని పెట్టి అన్ని సీట్లనుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపగల నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)కూడా కాంగ్రెస్‌తో కలవకుండా సొంతంగానే పోటీ చేయనుంది. ఈ రకంగా గుజరాత్‌లో విపక్ష ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌లో 12 శాతానికిపైగా ఉన్న పాటీదారులు 60 స్థానాల్లో నిర్ణాయక పాత్ర పోషించనున్నారు. 2015 డిసెంబరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. భాజపా 73 పంచాయతీల్లో విజయం సాధిస్తే- కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 132 చోట్ల గెలుపొందింది. దశాబ్దకాలంగా గుజరాత్‌లో ప్రతి ఎన్నికలోనూ ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇది కొత్త వూపిరి. పాటీదారులు తమకు దూరం జరుగుతున్న వాస్తవాన్ని భాజపాకు తెలియజెప్పిన ఎన్నికలవి. గుజరాత్‌ భారత్‌ జీడీపీలో 7.6 శాతం వాటా కలిగి ఉంది. భారత్‌ ఎగుమతుల్లో గుజరాత్‌ వాటా 22 శాతం. గుజరాత్‌ ప్రగతికి 22ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన భాజపాయే కారణమనడంలో అతిశయోక్తి లేదు. డెయిరీ సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, గ్రామీణ బ్యాంకులు ఇలా గుజరాతీ సమాజంలోని ప్రతి రంగంలోనూ భాజపా ముద్ర ఉంది. కార్యకర్తల బలం భాజపాకు పెట్టనికోట. పోల్ మేనేజ్ మెంట్ ఆ పార్టీ సొంతం. పోలింగ్‌ రోజున సానుభూతిపరులంతా తప్పనిసరిగా వచ్చి ఓటు వేసేలా చూసేందుకు ఏడు లక్షలమంది ‘పన్నా ప్రముఖ్‌’లు సిద్ధంగా ఉన్నట్లు భాజపా ప్రకటించుకొంది. రాష్ట్రంలో 40 శాతానికిపైగా ఉన్న ఓబీసీల్లోనూ భాజపాకు మంచి పట్టు ఉంది. స్వయంగా నరేంద్ర మోదీ- ఓబీసీ. రాష్ట్రంలోని 60 నగర, పట్టణ శాసనసభ స్థానాల్లో మెజారిటీ తమకేనని భాజపా విశ్వసిస్తోంది. 2012లో మొత్తం 182 సీట్లకుగాను భాజపా 115 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 61 సీట్లతో సరిపెట్టుకుంది. అప్పట్లో పట్టణ ప్రాంతాల్లో భాజపా 59.5 శాతం ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్‌ 32.8 శాతం ఓట్లకే పరిమితమైంది. గుజరాత్‌లో భాజపాకు నరేంద్ర మోదీయే కీలక ప్రచారాస్త్రం. ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ గుజరాత్‌లో మోదీ ప్రచార హోరు మరింత పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధికి ప్రాధాన్యం పెంచి; కుల, మత, వారసత్వ రాజకీయాలను తరిమికొట్టి ఆత్మగౌరవం చాటుకోవాలంటూ ఇటీవల నరేంద్ర మోదీ గుజరాత్‌ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మోదీ పిలుపు ప్రభావాన్ని తీసిపారేయలేం. గుజరాత్‌లో 150 సీట్లు కృతనిశ్చయంతో కదులుతున్న మోదీ, అమిత్‌ షా ద్వయం- ఉత్తర్‌ ప్రదేశ్‌ తరహా మ్యాజిక్ చేయదనే గ్యారంటీ ఏమీ లేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం