నోరు జారుతున్న బిజెపి నేతలు... ఎందుకిలా?


భాజపా నేతలు ఎందుకో నోరు జారుతున్నారు. పద్మావతి సినిమా వివాదం నేపథ్యంలో నటి దీపిక తల నరికితే రూ. 10కోట్లిస్తా అంటూ హరియాణా భాజపా నేత సూరజ్‌పాల్‌ ఇటీవల ఆఫర్ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. అది మరచిపోయే లోపే తాజాగా బిహార్‌లో మరో నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ వేలును నరికేయాలి అని బిహార్‌ భాజపా అధ్యక్షుడు, ఎంపీ నిత్యానంద్‌ రాయ్‌ ఆవేశంగా హెచ్చరించారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాయ్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ‘దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని, పేదరికాన్ని ప్రధాని మోదీ నిర్మూలించారన్నారు. అటువంటి వ్యక్తిని ఎవరైనా వేలెత్తి చూపితే ఆ వేలును విరగొట్టాలి. అవసరమైతే నరికేయాలి’ అంటూ రాయ్‌ వ్యాఖ్యానించారు. కాగా తాను అనుచితంగా ఏమీ మాట్లాడలేదని రాయ్‌ సమర్థించుకున్నారు. ప్రజలను సమాధి చేస్తానని కొందరు బెదిరిస్తున్నారు. అంతకంటే ఘోరంగా నేనేం మాట్లాడ లేదు అని రాయ్‌ అన్నారు.అయితే తర్వాత ఇద్దరు నాయకులూ తమ వ్యాఖ్యలపై వివరణలు ఇచ్చుకుని నష్ట నివారణ చర్యలకు దిగారు.

ముఖ్యాంశాలు