37 ఏళ్ల ముగాబే పాలన ముగిసింది


జింబాబ్వే అధ్యక్షుడిగా ఏకంగా మూడున్నర దశాబ్దాల పై చిలుకు ఏలుబడి సాగించిన రాబర్ట్‌ ముగాబే చివరికి మంగళవారం అవమానకర పరిస్థితుల్లో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్లమెంట్‌ స్పీకర్‌ జాకబ్‌ ముదెండా ధ్రువీకరించారు. ముగాబేను అభిశంసన తీర్మానం తో తొలగించేందుకు పార్లమెంట్‌ సిద్ధమైన తరుణంలో ముగాబే మరో దారి లేక రాజీనామా చేసారు. ఈ ఘటన అనంతరం హరారే వీధుల్లో పండగ కోలాహలం కనిపించింది. దేశ ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ను ముగాబే ఏకపక్షంగా తొలగించి తన భార్య గ్రేస్ కు అధికారం కట్టబెట్టేందుకు సిద్ధపడిన తరుణంలో సైన్యం ముగాబేను గృహనిర్బంధానికి గురి చేసిన సంగతి విదితమే. అనంతర పరిణామాల్లో భాగంగా అధికార జడ్‌ఏఎన్‌యూ-పీఎఫ్‌ పార్టీ ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. 24 గంటల్లో తప్పుకోకుంటే అభిశంసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనితో ఆయన రాజీనామా సమర్పించారు. ఎమర్సన్ కు సైన్యం మద్దతు ఉన్న దృష్ట్యా అయన తదుపరి అధ్యక్షుడు కావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.