భండారీ గెలుపు భారత్ వ్యూహాత్మక విజయం


అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జీగా భారతీయుడు దల్వీర్ భండారీ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంఘటన. ఈ గెలుపుతో ప్రపంచదేశాల్లో తన పలుకుబడిని భారత్‌ పెంచుకుంది. అంతర్జాతీయ సంబంధాల్లో మరింత కీలక పాత్రను పోషించడానికి ఈ గెలుపు భారత్ కి దోహదపడుతుంది. దల్వీర్‌ గెలుపునకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఉన్నతా ధికారుల బృందం, యూఎన్‌లోని దౌత్యాధికారులు పక్కా వ్యూహం ప్రకారం లాబీయింగ్ చేసి విజయం సాధించారు. భారతీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ విధించిన మరణశిక్షపై ఐసీజే గతంలో స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రమాన్ని ముందుకు తీసుకుపోయి పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాలంటే బెంచ్‌లో భారత జడ్జి ఉండడం అనివార్యమని గుర్తించిన భారత ప్రభుత్వం దల్వీర్‌ అభ్యర్థిత్వాన్ని మళ్లీ నామినేట్‌ చేయడంతో పాటు గెలుపుకోసం ముమ్మరంగా కృషి చేసింది. గత జూలైలో జీ 20 సమావేశంలో ఈ లాబీయింగ్‌ను మోదీ ప్రారంభించారు. చైనాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశం, మయన్మార్‌ తదితర దేశాల పర్యటనల్లోనూ మోదీ తగు మంత్రాంగం నడిపారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సమయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అధికారుల బృందం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాకు చెందిన 100 దేశాల ప్రతినిధుల్ని ఈ విషయమై సంప్రదించారు. ఢిల్లీలో పలు దేశాల రాయబారులతో కూడా మన విదేశాంగ శాఖ అధికారులు దీనిపై చర్చలు కొనసాగిస్తూ వచ్చారు. భండారీ విజయం విషయంలో సహకారం కోరుతూ ప్రధాని మోదీ స్వయంగా పలువురు ప్రధానమంత్రులకు లేఖలు రాశారని కూడా తెలిసింది. వీటన్నిటి ఫలితమే భండారీ విజయం. ఐరాస సర్వప్రతినిధి సభలో 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో 15 ఓట్లు ఆయనకు వచ్చాయి.అంతర్జాతీయ సంబంధాల విషయంలో, అంతర్జాతీయ అంశాలలో భారదేశం కీలకభూమిక పోషించే పరంగా ఈ గెలుపు సహకరిస్తుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం