రాటుదేలిన భారత విదేశాంగ విధానం


Trump and Modi

ఒకప్పుడు ఎవరేం చెప్పినా భారత్ వినాల్సి వచ్చేది... ఇప్పుడు భారత్ చెప్పినది ప్రపంచం వింటోంది. అవును.. అతిశయోక్తి అనిపించినా ఇది నిజమే. భారత విదేశాంగ విధానంలో వచ్చిన గణనీయమైన మార్పులు ఇప్పుడు లుక్ ఈస్ట్ అంటే ఇండియా వైపు చూడమని ప్రపంచానికి చెబుతున్నాయి. భారత్ ను సూపర్ పవర్ గా చేయడం ఒక అసాధారణ లక్ష్యం. దానిని చేరుకోవడం అంత సులువేమీ కాదు. అపారమైన జనాభా, అంతు లేని పేదరికం ఉన్న ఈ దేశాన్ని ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లు, పదేళ్ల కాలంలో సంపన్నంగా, సూపర్ పవర్ గా మార్చడం సాధ్యం కాదు. అయితే ప్రపంచ దేశాలతో నెరపే సంబంధాలు దేశ పరిస్థితులపై గట్టి ప్రభావం చూపుతాయి. రాత్రికి రాత్రి దేశ సామర్థ్యాన్ని అవి పెంచగలవు.. పేదరికాన్నీ తగ్గించగలవు.. బలాన్నీ పెంచగలవు. ఏ దేశానికైనా విదేశాంగ విధానం గుండెకాయ వంటిది. అది సక్రమంగా ఉంటేనే భద్రత పరంగా, వాణిజ్య పరంగా పురోగతి సాధ్యపడుతుంది. భారతదేశం శాంతికాముక దేశంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నప్పటికీ, దేశీయ ప్రయోజనాలను కాపాడే రీతిలో విదేశాంగ విధానం లేకపోవడంతో దశాబ్దాలుగా పలు కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడానికి సమర్థత, బలం కూడా అనివార్య అర్హతలనే విషయాన్ని అనేక గతానుభవాలు స్పష్టం చేసాయి. అయితే మొదటినుంచీ మన పాలకులు ఈ అంశాన్ని ఒకింత నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారనేది సుస్పష్టం. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతూ వస్తున్నాయి. స్థూలంగా చూస్తే భారతదేశం తన విదేశాంగ విధానాన్ని సమూలంగా సవరించుకుందని అనిపిస్తున్నది. ముఖ్యంగా పక్కలో బల్లేల మాదిరిగా తయారైన పాకిస్థాన్, చైనా దేశాల విషయంలో ముందెన్నడూ లేనంత కఠిన వైఖరి మొదలు, పొరుగున ఉన్న చిన్న దేశాలు, ప్రపంచంలోని శక్తిమంతమైన వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాల మెరుగుదల పరంగా చూస్తే ఊహించలేని మార్పు గత మూడేళ్ళ కాలంలో కనిపిస్తుంది. మూడేళ్ళంటే వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరంగా చుస్తే చాలా తక్కువ సమయం.. కానీ ఈ తక్కువ వ్యవధిలోనే భారత్ తన విదేశాంగ విధానంలోని పాత లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు కొత్త మెరుగులు దిద్దుకుని బలమైన రాజ్యంగా సత్తాను చాటుకుంది. ఇందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా పడిన ప్రయాస తక్కువేమీ కాదు. ద్వైపాక్షిక సంబంధాలను గాడిన పెట్టడం కోసం ఆయన విసుగు, విరామం లేకుండా విదేశీ పర్యటనలు సాగించారు. 2014 మే 26 న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ గత 40 నెలల్లో మొత్తం 56 విదేశీ పర్యటనలు చేసారు. ఆరు ఖండాల్లోని 49 దేశాలను సందర్శించి ఆయా దేశాధినేతలతో విస్తారంగా చర్చలు జరిపారు. కొన్ని దేశాలను ఐదు సార్లు, మూడు సార్లు, రెండు సార్లు కూడా ఆయన సందర్శించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికా, జపాన్ దేశాలతో సాన్నిహిత్యం గణనీయంగా పెంచుకోవడం గొప్ప పరిణామం. జపాన్ ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో భారత్ పట్ల తన సానుకూల ధోరణి ప్రదర్శించడం గమనార్హం. చైనా తో డోక్లామ్ వద్ద భారత్ కు ఏర్పడిన వివాదంలో జపాన్ తన పూర్తి మద్దతును భారతదేశానికి ప్రకటించింది. అంతే కాకుండా ఈ వివాదాన్ని ముగించిన తీరు భారత్ ఘన విజయమని, ఇది భారత దేశపు పట్టుదలకు, నైపుణ్యానికి నిదర్శనమని కూడా జపాన్ శ్లాఘించింది. భారతదేశం గొప్పతనాన్ని తన రాజ్యాంగంలోనే కీర్తించిన దేశం ఇజ్రాయెల్.. కానీ ఇంతవరకూ ఆ దేశంతో సరైన సాన్నిహిత్యాన్ని, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పుకునే రీతిలో భారత నాయకత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ఇజ్రాయెల్ లో తొలిసారి పర్యటించిన భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. రక్షణ రంగంలో కూడా ఆ దేశపు భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు బలపడేలా వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఊపిరి సలపని విదేశీ పర్యటనలు చేస్తున్న నరేంద్ర మోదీ పై మొదట్లో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే అనతి కాలంలోనే వాటి ప్రయోజనం, పరమార్థం ఏమిటనే విషయం ప్రజలకు అర్థం కావడంతో ప్రతిపక్షాల నోళ్లకు తాళాలు పడ్డాయి. భారత విదేశాంగ విధానం మారిన కారణంగానే గత రెండు నెలల్లో భారత్ రెండు అతిపెద్ద దౌత్య విజయాలను సాధించి అంతర్జాతీయంగా ప్రతిష్టను పెంచుకుంది. సీమాంతర ఉగ్రవాదం విషయాన్ని అసలు బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించనే రాదని మొదట్లో షరతు పెట్టిన చైనా తన వైఖరి మార్చుకోక తప్పలేదు. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని, ఆ దేశం పెంచి పోషిస్తున్న వివిధ ఉగ్రవాద సంస్థలను నేరుగా ప్రస్తావించి మరీ ఉతికి ఆరేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చివరికి బ్రిక్స్ దేశాల సదస్సు ఏకగ్రీవంగా ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదించింది. పాకిస్థాన్ కు చైనా పెద్దరికంలోనే ఈ సదస్సు మొట్టికాయలు వేసింది. ఇది భారతదేశం సాధించిన రెండవ అతిపెద్ద దౌత్య విజయం. మరి మొదటి విజయం ఏమిటి? డోక్లామ్ వద్ద తిష్ట వేసిన చైనా బలగాలను ఉపసంహరించుకునేలా చేయడమే ఆ మొదటి దౌత్య విజయం. చైనా హఠాత్తుగా తన సేనల ఉపసంహరణకు ఎందుకు సిద్ధమైంది. ఈ గొడవలో చిన్న పాత్రధారి అయిన హిమాలయరాజ్యం భూటాన్ ప్రస్తావన, జోక్యం కూడా లేకుండానే రెండు పెద్ద దేశాలూ డోక్లామ్ వద్ద వివాదానికి స్వస్తి పలికి జూన్19 నాటి పరిస్థితి పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఎందుకు ప్రకటించాయి? నిజానికి ఇవన్నీ ఆసక్తి కలిగించే ప్రశ్నలు. చైనా తనకు భారత్ తో ఉన్న సరిహద్దు ప్రాంతంలో గల మూడో దేశపు (భూటాన్) భూభాగంలో సైనిక అవసరాలు, చమురు రవాణా అవసరాల కోసం ఆధిపత్య ధోరణితో, విస్తరణ దృష్టితో చేపట్టిన నిర్మాణాలను భారత్ నిర్ద్వంద్వముగా వ్యతిరేకించింది. భూటాన్ ఆధీనంలోని ఈ పీఠభూమిలోకి భారత సైనికుల బృందం రెండు బుల్డోజర్లతో రాగానే చైనా మీడియా, ప్రభుత్వ విభాగాలు చేసిన రభస అంతా ఇంతా కాదు. ఘర్షణ తప్పదని, 1962 యుద్ధంలో జరిగినదానికంటే ఇండియా ఎక్కువ నష్టపోతుందని చైనా పత్రికలు హెచ్చరించాయి. చైనా సైన్యాధికారులు కూడా అవసరాన్ని మించి స్పందించారు. పాశ్చాత్య మీడియా అయితే ఏ క్షణంలోనైనా భారత్ పై చైనా దాడి చేస్తుందని జోస్యం చెప్పి ఉద్రిక్తతను అమాంతం పెంచింది. అయితే 75 రోజుల లోపే చైనా అనూహ్యంగా దిగివచ్చి ఇండియాకు శాంతిహస్తం అందించి తన దళాలను వెనక్కి పిలిపించింది. ఈ మూడున్నర నెలల్లో జరిగినదే నిజమైన దౌత్య పోరాటం. చైనా ఎంతగా రెచ్చగొడుతున్నా సంయమనం కోల్పోకుండా నిదానంగా, నిబ్బరంగా వ్యవహరించిన భారత నాయకత్వం అదే సమయంలో చైనాకి నాలుగు దిక్కుల్లోనూ పొగ పెట్టే ప్రక్రియ ముమ్మరం చేసింది. డోక్లామ్ విషయంలో చైనా దూకుడును, తప్పిదాన్ని, అంతర్జాతీయ ఒప్పందాలపై ఆ దేశం చిన్నచూపును అగ్ర దేశాలకు ఇండియా తగురీతిన వివరించి వాటి మద్దతు కూడగట్టింది. ముఖ్యంగా జపాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఈ విషయంలో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందనే విషయాన్ని మాటలు, చేతల ద్వారా స్పష్టం చేయడం చైనాకి వణుకు పుట్టించింది. చివరికి రష్యా కూడా భారత్ వైఖరినే సమర్థిస్తుందనే అనుమానాన్ని కలిగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సఫలమయ్యారు. వ్యూహాత్మకంగా తనకు కావలసిన డోక్లామ్ భూభాగం కోసం చైనా అంతకంటే ఎక్కువ భూభాగాన్ని భూటాన్ కి ఇవ్వజూపినా కూడా ఫలితం లేకపోవడం.. చైనా వంటి పెద్ద దేశం అభీష్టానికి వ్యతిరేకంగా భూటాన్ వంటి అతి చిన్న దేశం స్థిరంగా నిలబడగలగడం భారత్ దౌత్య ప్రయత్నాల విజయమే. చైనా ఒత్తిడికి తలొగ్గితే భూటాన్ అస్తిత్వానికి ముప్పనే విషయాన్ని మనదేశం భూటాన్ కి అర్థం అయ్యేలా చెప్పగలిగింది. ప్రధాని మోదీ మూడేళ్ళ కిందట తన తొలి విదేశీ పర్యటన భూటాన్ లోనే ఎందుకు జరిపారనే సూక్ష్మం చాలామంది పరిశీలకులకు అప్పట్లో అర్థం కాలేదు. వారికి నాటి పర్యటన ఆంతర్యం ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. ఉద్రిక్తతకు తెరపడినా డోక్లామ్ వద్ద చైనా దళాలు గస్తీ, స్థావరం పరిరక్షణ బాధ్యతలు కొనసాగిస్తాయని చైనా విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు. సైనిక సామాగ్రి, రోడ్డు నిర్మాణ సామాగ్రి ఇవన్నీ వెనక్కి ఎందుకు పంపేశారో మాత్రం వారు చెప్పడంలేదు. అయితే దీనిపై ఇప్పుడు ఇండియాకి అనవసర భయాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే దేశం కాదని మన ప్రభుత్వం ఇప్పటికే చైనాకి ఋజువు చేసింది. వాతావరణం, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు నిర్మాణంపై తగిన సమయంలో నిర్ణయిస్తామని చైనా అధికారి ఒక వ్యాఖ్య చేసారు. అంటే ఇది తగిన సమయం కాదని వారికి అర్థం అయిందన్న మాట. పూర్తిగా తన వైఖరి మార్చుకున్నట్టు, వెనుకంజ వేసినట్లు, తగ్గినట్లు ప్రపంచానికి కనపడకుండా ఉండటానికే చైనా ప్రతినిధులు ఇలా పిల్లిమొగ్గలు వేస్తున్నారనేది నిర్వివాదం. అయితే శత్రువు అత్యంత బలశాలి కనుక రెచ్చగొట్టకుండానే లౌక్యంగా భారత నాయకత్వం చైనాని వెనక్కి పంపించింది. గెలిచాం, గెలిచాం అంటూ చైనా వెనకడుగు వేస్తుంటే .. భారత్ మాత్రం ఓడారని అనకుండానే మౌనంగా చూస్తూ విజయ దరహాసం చిందించడం ఒక చిరస్మరణీయ సందర్భం. ఇక తాజాగా ఆసియాన్ సమ్మిట్ లో మన దేశం పోషించిన కీలక పాత్ర ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకారంలో 21 సభ్యదేశాలున్నాయి. పసిఫిక్‌ తీరప్రాంతం కలిగిన దేశాలు ఈ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే హిందూమహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక స్థానాలు చాలా ఉన్నాయి. చైనాను కట్టడి చేయాలంటే ఇక్కడ అమెరికాకు భారత్ సహకారం కావాలి. అందుకే ముందస్తువ్యూహంలో భాగంగా ట్రంప్‌ ఎపెక్‌లో భారత్‌ సభ్యత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రాంతంలో భారత్‌ ప్రాబల్యం పెరుగుతుండటం చైనాను బెంబేలెత్తించే అంశం. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ చేతులు కలపడాన్ని చైనా తట్టుకోలేకపోతున్నది. తమను లక్ష్యంగా చేసుకునే మనీలాలో సాగుతున్న ఆసియాన్‌ సమావేశా ల్లో ఈ నాలుగు దేశాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయని బెదురుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా భారత్ ను ఆసియాలో కీలక భాగస్వామిగా భావిస్తున్నాయి. అలాగే బ్రిక్స్ సదస్సులో పాకిస్థాన్ తీవ్రవాదం విషయంలో చైనాను ఒప్పించి కీలక ప్రకటన చేయించడం, మసూద్ అజహర్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా చేత ప్రకటింపజేసి చైనాకి షాక్ ఇవ్వడం, అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా పక్కా వ్యూహం ప్రకారం దల్వీర్ భండారీని గెలిపించి అంతర్జాతీయంగా పలుకుబడిని పెంచుకోవడం... ఇవేవీ చిన్న విషయాలు కావు. వీటిలో ఏవీ కాకతాళీయంగా సంభవించేవి కావు. ఎంతో ముందుచూపు, పక్క ప్రణాళ