ఐటీ కంపెనీలపై సేవా పన్ను పిడుగు

ఐటీ కంపెనీలకు పన్నుల శాఖ పంపిన నోటీసులతో అవి బెంబేలెత్తిపోతున్నాయి. దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలు పదివేల కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి నోటీసులు 200 సంస్థలకు అందాయి. గత ఐదేళ్ల కాలంలో (2012-2016) విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసి పొందిన ప్రజయోనాల రిటర్న్స్ వెంటనే దాఖలు చేయాలని సేవా పన్నుల శాఖ ఐటీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆలస్యం చేసినందుకు వడ్డీ, జరిమానాలతో పాటు అదనంగా 15 శాతం సేవా పన్ను కూడా చెల్లించాలని వాటిలో పేర్కొన్నారు. విదేశీ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ను అందించడం అంటే అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ వినియోగదారుకు విక్రయిస్తున్నట్టే అని పన్నుల శాఖ పేర్కొంది. దీనిపై ఐటీ కంపెనీలు ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లాలని అనుకుంటున్నాయి. అయితే అలా వెళ్లాలన్నా ముందుగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలపై పునరాలోచనలో పడ్డాయి.