చార్మినార్ గాజులపై ఇవాంక ఆసక్తి !


హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి వెళితే అక్కడి గాజుల దుకాణాలను చూడకుండా ఎవరూ ఉండరు. చార్మినార్ గాజులంటే అంత ప్రత్యేకం మరి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా చార్మినార్ గాజులపై ఆసక్తి కనబరిచారట! ఆమె హైదరాబాద్ వస్తున్న సందర్భంగా చేర్చాల్సిన కార్యక్రమాల్లో చార్మినార్ ఏరియాలోని గాజుల దుకాణాలు కూడా ఉన్నాయిట! ఈ విశిష్ఠ అతిథికి చార్మినార్‌ చూపించి అక్కడ దుకాణాల్లోని గాజులు కొనిపించాలని ఇప్పుడు అధికారులు సన్నాహాల్లో ఉన్నారు. అయితే ఇవాంక చార్మినార్ ఏరియా పర్యటన అంటే ఆషామాషీ కాదు. భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, రాష్ట్ర పోలీసు అధికారులు చార్మినార్‌ పరిసర ప్రాంతాలను మంగళ, బుధ వారాల్లో నిశితంగా పరిశీలించారు. ఇవాంక సందర్శించడం కోసం ఐదారు గాజుల దుకాణాలను ఎంపిక చేసి వాటిలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న గాజులు, వాటి తయారీకి వాడిన పదార్థాలు, అవి ఎక్కడ తయారయ్యాయి వంటివన్నీ ఆరా తీశారు.అంతే కాకుండా షాపుల యజమానులు, పనివారి వివరాలన్నీ నమోదు చేసారు. ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్‌ సిబ్బంది వివరాలన్నీకూడా అధికారులు సేకరించారు. ఆమె ఉన్నప్పుడు విధుల్లో పాల్గొనే వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేసారు.