నటుడి ఓవర్ యాక్షన్ .. పోలీస్ రియాక్షన్


బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ బుధవారం ముంబయిలో కార్లో వెళుతూ రెడ్ సిగ్నల్ పడడంతో ఆగాడు. ఆ సమయంలో వరుణ్‌ కారు పక్కనే ఆగిన ఆటో లోనుంచి ఓ యువతి అతడితో సెల్ఫీకావాలని కోరింది. వరుణ్‌ ఓకే అని కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టాడు... ఆ యువతి కూడా ఆటో నుంచి తల బయట పెట్టగా వారిద్దరూ సెల్ఫీ దిగారు. తర్వాత ఇంకేముంది.. ఈ ఫోటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేయడంతో ముంబయి పోలీసుల దృష్టిలో పడింది. వారు ఈ ఫొటోను తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇలాంటి సాహసాలు వెండితెరపై బాగుంటాయి కానీ ముంబయి రోడ్లపై కాదు. దీనిద్వారా మీరు మీ జీవితాన్నే కాదు ఇతరుల జీవితాలను కూడా రిస్క్‌ లో పెట్టారు. మీలాంటి యూత్‌ ఐకాన్‌ నుంచి మేం ఆశించేది ఇది కాదు. ప్రస్తుతం మీకు ఈ-చలాన్‌ పంపుతున్నాం. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. అయితే ఈ విషయం తెలిసిన వరుణ్‌ ట్విటర్‌ లోనే పోలీసులకు క్షమాపణలు చెప్పాడు. ‘క్షమించండి. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద నా కారు ఆగే ఉంది కదా అని, అభిమాని కోరిక కాదనలేక ఇలా చేశాను.. ఇకపై జరగకుండా జాగ్రత్త పడతా’ అని చెప్పి సంస్కారంతో వ్యవహరించాడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం