హెరిటేజ్ సిటీ గా రాజమహేంద్రవరం


Rajahmundry

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు కలిగిన రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీ గా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. రాజరాజ నరేంద్రుడు పాలించిన ఈ నగరం ఆంద్ర మహాభారత సృష్టికి పట్టుగొమ్మ. వారసత్వ నగరాల ఎంపికలో భాగంగా రాజమహేంద్రవరంలో కేంద్ర బృందం ఇటీవల పర్యటించింది. హృదయ్‌ (వారసత్వ నగరాల అభివృద్ధి పథకం)లో చేర్చేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) పంపించాల్సిందిగా నగరపాలక యంత్రాంగానికి ఈ బృందం సూచించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా నగరపాలక సంస్థ, వారసత్వ సంపదను కాపాడేందుకు, పురాతన ఆనవాళ్లను పునరుద్ధరించేందుకు రూ.170 కోట్ల వ్యయం అంచనా వేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అఖండ గోదావరి తీరాన ఉన్న రాజమహేంద్రవరం పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.85 కోట్లతో ఇందుకు ప్రతిపాదనలు రూపొందించారు. గోదావరి ఘాట్ల విస్తరణ, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుదీకరణ, సుందరీకరణ, పార్కింగ్‌ స్లాట్లు, ఘాట్ల వద్ద ఉచితంగా వైఫై సదుపాయం వంటివి వీటిలో ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం నిర్మించిన టౌన్‌హాల్‌ను రూ.15 కోట్లతో పునరుద్ధరిస్తారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలను రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ కళాశాలలో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తారు. కోటగుమ్మం ఏరియాను పాత నగరంగా ఉన్న గుర్తింపు మేరకు రూ.45 కోట్లతో విస్తరించి అభివృద్ధిపరుస్తారు. ప్రసిద్ధ గౌతమీ గ్రంథాలయాన్నిసంపూర్ణంగా అభివృద్ధి పరుస్తారు.

ముఖ్యాంశాలు