15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం


15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక సంఘం సభ్యుల నియామకం, విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విలేకరులకు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 మార్చి వరకు అమల్లో ఉంటాయి. 2020 ఏప్రిల్ నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం కొత్త ఆర్థిక సంఘం ఏర్పాటుకు ఇప్పుడే ఆమోదముద్ర వేయడం ఎందుకంటే రాష్ట్రాలతో చర్చలు జరిపి కొత్తది ఖరారు చేయడానికి రెండు సంవత్సరాల గడువు అవసరం. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో చాలా మార్పులు ఉంటాయని జైట్లీ తెలిపారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాత విధానం ఉండదన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల జీతభత్యాలు, పింఛన్‌, గ్రాట్యూటీ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. 31 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1079 మంది హైకోర్టు న్యాయమూర్తులు, 2500 మంది విశ్రాంత న్యాయమూర్తులకు ఈ పెంపుదల వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సంఘాలతో 8వ విడత వేతన సంప్రదింపులు జరపడానికి యాజమాన్యాలకు అనుమతినిచ్చింది. మహిళా సాధికారత, సంరక్షణకు అమలుచేస్తున్న పథకాలు 2019-20 వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. దేశంలో 115 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో గ్రామీణ మహిళలకు సాధికారతకు ‘ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర’ పేరుతో కొత్త పథకం ప్రారంభానికి నిర్ణయించింది. బేటీ బచావో, బేటీ పడావో పథకం దశలవారీగా 640 జిల్లాలకూ విస్తరణ. అన్ని రాష్ట్రాల్లో మహిళా సహాయవాణి ఏర్పాటు. ‘యూరోపియన్‌ బ్యాంక్‌ ఫర్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’లోభారత్‌ సభ్యత్వం తీసుకోవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అడవులు కాని ఇతర ప్రాంతాల్లో కానీ పెంచే వెదురును నరకడానికి, తరలించడానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేనివిధంగా భారతీయ అటవీ చట్టానికి సవరణ చేయాలని అత్యవసరాదేశం జారీ చేసింది.

ముఖ్యాంశాలు