పద్మావతి వివాదంలో విషాద పరిణామం


బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’పై కొనసాగుతున్న వివాదం ఇవాళ ఘోరమైన మలుపు తిరిగింది. పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా జైపూర్ సమీపంలోని నహార్‌గఢ్ కోటపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోట పైభాగం నుంచి వెలుపలి వైపు అతడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించండంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ‘‘పద్మావతిని వ్యతిరేకిస్తున్నా’’.., ‘‘దిష్టిబొమ్మలు తగలబెట్టడం కాదు.. మేమే చనిపోతాం...’’ అంటూ కోటరాళ్లపై నినాదాలు రాసి ఉన్నాయి. బ్రహ్మపురి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్యచేసి మృతదేహాన్ని వేలాడదీశారా అన్నది ఇంకా తెలియరాలేదు. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా అతడిని చేతన్‌గా గుర్తించారు. అయితే ‘పద్మావతి’పై కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళన చేస్తున్న రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. కర్ణిసేన సభ్యుడు మహిపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇది మా విధానానికి పూర్తి వ్యతిరేకం. ఇలా ప్రాణాలు తీసుకోవడం పద్ధతి కాదు.. అలాంటి చర్యలకు పాల్పడవద్దని మేము ప్రజలను కోరుతున్నాం..’’ అని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు