ఎల్లలెరుగని ప్రాశస్త్యం...శ్రీమద్రామాయణ వైశిష్ట్యం


రామ కథను వాల్మీకి మహర్షి తన అపూర్వ తపోశక్తి ఫలితంగా.. భగవదనుగ్రహంతో మానవాళికి గొప్ప వరంగా అందించాడు. ఆ రామకథా సుధాస్రవంతి అక్కడితో ఆగిపోలేదు. ఆ మహనీయుని వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న అనేక మంది మహర్షులు, మహాత్ములు, పుణ్యాత్ములు ఈ కథను మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఎవరు చెప్పినా.. ఎన్ని సార్లు.. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్నెన్ని విధాలా తిరగ రాసినా, ఎన్ని కొత్త సొబగులద్దినా వాసి తరగని అద్భుత గాధ ఇది. అందుకే చెప్పిన కొలదీ... వింటున్న కొలదీ చదువుతున్న కొలదీ.. కొత్తగా, మధురంగా, రసభరితంగా, మనోహరంగా, జన తారకంగా, జ్ఞాన దాయకంగా, అద్భుత ఫలభరితమై ఒప్పుతూ ఈ దివ్య గాధ అందరినీ అలరిస్తోంది. ఎందరినో తరింప జేస్తోంది. ఎందరో ఉత్తములు రామాయణాన్ని తిరిగి చెప్పగా, మరెందరో వ్యాఖ్యానాలు రాశారు. సంస్కృతంలో వశిష్ట రామాయణం, ఆనంద రామాయణం, అగస్త్య రామాయణం, ఆధ్యాత్మ రామాయణం (వ్యాస విరచిత బ్రహ్మాండ పురాణాంతర్గతం) ఉంటే, తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం వంటివి ఉన్నాయి. అవధీ భాషలో తులసీదాస విరచిత రామచరిత మానస్ సుప్రసిద్ధం. ఇవే కాకుండా బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ రామాయణాన్ని పలువురు రచించారు. ఆధునిక కాలంలో కూడా రామాయణ కథను పలువురు మళ్ళీ చెప్పారు. మన దేశంలోనే కాదు పలు విదేశాల్లో కూడా రామకథ పలు కళారూపాలుగా, సాహిత్యంగా బహుళ ప్రాచుర్యం పొందినది. ప్రజల నాల్కలపై నానుతున్నది. వారి జీవన విధానాలపై విశిష్ట ప్రభావం చూపుతున్నది. ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్, రష్యా తదితర దేశాల్లో రామ కథ ప్రచారంలో ఉంది. ఎలా, ఎపుడు, ఎక్కడ, ఎవరు చెప్పినా రామాయణానికి మాతృక వాల్మీకిదే. ఆయన చెప్పినదే అసలైన రామకథ. ఇది మానవ చరిత్రలోనే ఒక అపురూపం. ఈ కథ పౌరాణికమే కాదు ఇతిహాసం కూడా. ధార్మిక జీవనం ఎలా ఉంటుందనేది రామాయణాన్ని చదివిన వారికి ప్రత్యక్షంగా అవగతం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాల్మీకి రాసినది సాధారణ చరితాన్ని కాదు. అర్థ కామములతో కూడి ధర్మ మోక్షాలతో విస్తరించిన మహాచరితమది. ఈ కథ సముద్రం వలె రత్న సంశోభితం. సర్వ జన సమ్మోహన సచ్చరితం. సనాతన ధర్మానికి, వైదిక జీవనానికి ఆయువు పట్టు. తనకు బ్రహ్మోపదేశమై సంక్రమించిన ఈ దివ్య కథను నారదుడు ఉపదేశించగా.. ఆపై బ్రహ్మవాక్కు చే ఆ మహాగాధను జగద్విదితం చేసిన మహద్భాగ్యం వాల్మీకిది. ఆదికవిగా వాల్మీకికి లభించిన విఖ్యాతి ప్రాచీన భారతీయుల విశాల దృక్పథానికి, విద్వత్తుకు ఆనాడు ఉన్న విలువకు నిదర్శనం. రామాయణానికి ఆదికావ్యంగా లభించిన ప్రఖ్యాతి, నేటికీ ఆ మహద్ గ్రంథంపై తరగని ఆసక్తి ఉన్నత జీవన విలువలపై భారతీయులకు గల అనురక్తికి తార్కాణం. శ్రీరాముడనే అసాధారణ, అత్యద్భుత వ్యక్తిత్వాన్ని... యావత్ ప్రపంచానికీ ఆదర్శప్రాయమైన ఉత్తమ పురుషుని జీవన క్రమాన్ని.. రామాయణ కావ్యంలో వాల్మీకి ప్రపంచానికి పరిచయం చేశాడు. రాముడికి ఆయన తన రచనలో ఎక్కడా దివ్యత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేయలేదు. రాముడు భగవదవతారుడు అనే విషయాన్ని ఆయన తెర వెనుక నేపథ్యంగానే ఉంచాడు. ఎందరెందరో ఋషులు, విభీషణ హనుమదాదులు రాముడ్ని సాక్షాత్తు భగవంతుడని, అవతార పురుషుడని, స్వయం నారాయణుడని కొలిచి కీర్తించడం రామాయణంలో కొన్నిచోట్ల కనిపిస్తుంది. కానీ రాముడు మాత్రం ప్రతి సన్నివేశంలోనూ సంపూర్ణ మానవునిగానే ప్రవర్తిస్తాడు. అలా ఆయన ఉదాత్త మానవునిగా వ్యవహరించడం చేత ఆయన మానవులందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ నరోత్తముడి దివ్య గుణగణాలు ఇవాల్టికీ లోకులకు ఆచరణ యోగ్యము, ఆచరణ సాధ్యమూ కావడానికి, వారు ఆయనను ఆదర్శంగా ఎంచి అనుసరించడానికి ఆయన మానవుడే కావడం దోహదం చేసింది. రామాదుల వల్లనే, రామాయణం వల్లనే ఇవాల్టికీ లోకంలో మంచి అనేది కొంతైనా మిగిలి ఉంది. రామాయణమే లేకుంటే, రామాయణం పై జనులకు విశ్వాసమే లేకుంటే సమాజంలో నైతిక విలువలు, కుటుంబ విలువలు, మానవ సంబంధాలు ఈపాటికే పూర్తిగా లుప్తం అయిపోయి ఉండేవి. మానవుడనే వాడు మచ్చుకైనా కనిపించని పరిపూర్ణ దానవ సమాజమే దాపురించి ఉండేది. అందుకే శ్రీమద్రామాయణం సర్వ మానవాళికీ ఆదర్శనీయ గ్రంథం. ఇందలి ధర్మాలు సర్వ లోకాలకూ, సర్వ కాలాలకూ అనుసరణీయాలు. ఇందలి నాయకుడు శ్రీరామచంద్రుడు సర్వులకూ సర్వదా ఆరాధ్యనీయుడు. వాల్మీకి మహర్షి రామ చరితాన్ని ఎలా అనుగ్రహించాడనే విషయమై చాలా సందేహాలు పలువురిలో ఉన్నాయి. రాముడి కాలంలోనే వాల్మీకి ఉన్నాడని కొందరు, రాముడి తర్వాతి వాడని మరికొందరు... కాదు కాదు రామునికంటే ముందే ఉన్నాడని ఇంకొందరు అంటుంటారు. అయితే ఎక్కువమంది పండితులు అంగీకరించిన దానిని బట్టి రామకథను వాల్మీకి రామావతార ప్రకటనకు ముందే వల్మీకం నుంచి గ్రహించాడు. ఆ తర్వాత నారద బ్రహ్మాదులు ఆయనకు చెప్పారు. వీటికి రామావతారానికి మధ్య పెద్దగా వ్యవధి లేదు..ఆ తర్వాత రామ జననం, ఇతర సంఘటనలు జరిగిపోయాయి. ఇదంతా బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరం చేత ధర్మబుద్ధితో, దివ్య దృష్టి తో గాంచి వాల్మీకి రామకథ మొత్తం రాశాడు. ధర్మ దృష్టితో ధ్యానంలో ఉండి వాల్మీకి రామకథను దర్శించాడని రామాయణం లో స్పష్టంగా ఉంది. అయితే రాముడి పాలన సాగుతున్న సమయంలోనే వాల్మీకి అట్టి లోకోత్తర పురుషుడి కథని జగతికి తెలియజేయాలనే తలంపుతో రామాయణం రాసి ఆ కథని మహర్షుల సదస్సులో వినిపించాడని కూడా ఒక వాదన ఉంది. అప్పుడు అందరూ ముక్త కంఠం తో రాముని గొప్పతనాన్ని, వాల్మీకి కవన వైదుష్యాన్ని ప్రశంసించారని ఇది విశ్వసించే వారి మాట. దీనికి బహుశా ఉత్తర రామాయణ సంఘటనలు ఆధారం కావచ్చు. రామాయణంలోని ప్రతి పాత్రకు ఒక ఔచిత్యం, ఉదాత్తత ఉన్నాయి. ప్రతి సన్నివేశానికి ఒక విశిష్టత ఉంది. ఆయా పాత్రల స్వరూప స్వభావాల్ని, హావ భావాలను, సన్నివేశాల ఆంతర్యాన్ని, తత్త్వాన్ని వాల్మీకి తనకు బ్రహ్మ ప్రసాదించిన దివ్య చక్షువులతో నిశితంగా పరిశీలించాడు. ప్రతి సన్నివేశాన్ని అవగాహన చేసుకున్నాడు.. ప్రతి పాత్ర నడవడికను అవగతం చేసుకున్నాడు... సన్నిహితంగా పరిశీలించాడు. రామకథను ఆవాహన చేసుకున్నాడు.. ఆ కథే తానయ్యాడు. అలా ఆ దివ్య కథను అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతూ వాల్మీకి సీతాచరితం పేరుతో రాశాడని.. ఆ తర్వాత అది పౌలస్త్య వధ పేరుతో ప్రచారంలోకి వచ్చిందని... ఈ కథలో ఉన్నది రాముని ప్రస్థానమే గనుక అంతిమంగా రామాయణం అయిందని పెద్దలు చెబుతారు. ఇక్కడే రామాయణ హృదయాన్ని, అందుకు సంబంధించిన సత్యాన్ని మనం శ్రద్ధతో అవగతం చేసుకోవాలి. రామాయణాన్ని వాల్మీకి ఎప్పుడు రాశాడనే కాల నిర్ణయం, ఏ పేరుతో రాశాడనే సదసత్ సంశయం మనకు సమస్యలు కారాదు. ఎప్పుడు రాసాడని గాక ఏమి చెప్పాడనే విషయాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఈ దివ్య గ్రంథం ద్వారా వాల్మీకి ప్రతిష్టించిన లోకోత్తర విలువలను ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకోవాలి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us