హైదరాబాద్ మెట్రో తొలి ప్రయాణికుడు ఈయనే!


హైదరాబాద్‌ మెట్రోరైలు తొలి ప్రయాణికుడు ఎవరో తెలుసా... ఇంకెవరు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! ఈ నెల 28న మెట్రోను ప్రారంభించనున్న మోదీ మొదటి టికెట్‌ను ఆయనే కొనుగోలు చేయనున్నారు. తర్వాత గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ టికెట్లు కొంటారు. అనంతరం మంత్రులు తదితరులకు మెట్రో సిబ్బంది టికెట్లు విక్రయిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ చేస్తోంది. మియాపూర్‌-కూకట్‌పల్లి స్టేషన్ల మధ్య ప్రధాని, ఇతర ప్రముఖులు ప్రయాణిస్తారు. ఇక ఆ తర్వాత ఆ రోజు మెట్రోరైళ్లు ప్రయాణించవు. సాధారణ ప్రయన్లు మరునాటి నుంచే ఉంటాయి. కాబట్టి ప్రజలకు మరుసటి రోజు నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు. అయితే మెట్రోపాస్‌ల విక్రయాన్ని ఎల్‌అండ్‌టీ అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఐటీ సంస్థలు తదితర చోట్ల కియోస్కులను ఏర్పాటుచేసి, వాటిని విక్రయిస్తున్నారు. మెట్రో టిక్కెట్ల ధరలను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రకటిస్తారు. నాగోలు-మెట్టుగూడ మధ్య రాష్ట్ర మంత్రులు, నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం ప్రయాణిస్తారని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు