గుజరాత్ లో చాయ్ పే చర్చ హంగామా!


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో ‘చాయ్‌’ ప్రాధాన్యం అంత ఇంతా కాదు. 2014 ఎన్నికలకు ముందు ‘చాయ్‌ పే చర్చ’ పేరిట మోదీ పక్షాన దేశవ్యాప్తంగా బిజెపి విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ప్రధాని మోదీని ‘చాయ్‌ వాలా’అంటూ ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు రావడంతో దాన్ని తొలగించింది. దీనికి ఎదురుదాడిగా మళ్ళీ గుజరాత్ ఎన్నికల్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని బిజెపి చేపట్టింది, ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు గుజరాత్ లో టీ దుకాణాల వద్ద స్థానికులతో కలిసి ప్రసంగాన్ని వింటూ టీ సేవించారు. రాష్ట్రవ్యాప్తంగా 182 నియోజకవర్గాలు.. 50,128 పోలింగ్‌ స్టేషన్లలో ‘మన్‌కీ బాత్‌, చాయ్‌కే సాత్‌’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్రమంత్రులు వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దరియా పూర్‌ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి అమిత్‌ షా టీ సేవించారు. సూరత్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి జైట్లీ, పంచమహల్‌ ప్రాంతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ పాల్గొన్నారు. వీరితోపాటు డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్రప్రదాన్‌, ఉమా భారతి, స్మృతి ఇరానీ, జువల్‌ ఓరమ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు.