తెదేపా కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన


మంగళగిరి సమీపంలో నిర్మించే తెదేపా కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. ఉండవల్లి సమీపంలో ముఖ్యమంత్రి నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్‌ హాలును ప్రారంభించారు. ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. 2018 డిసెంబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. 3.60 ఎకరాల విస్తీర్ణంలో 3 భవనాలు నిర్మిస్తున్నారు. పరిపాలనా భవనం జీ+4 అంతస్తులతో నిర్మిస్తారు. ఐదో అంతస్తులో పార్టీ జాతీయఅధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయా లుంటాయి. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకీ దక్కని గౌరవం టీడీపీకి దక్కిందన్నారు. తెదేపా కార్యాలయంలో నిత్య భోజన వసతి కల్పించడం ఆనవాయితీ అని, దీని కోసం ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే అవకాశం దీనితో కలుగుతుందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఈ స్థాయిలో కృషి చేసే పార్టీ దేశంలో మరొకటి లేదని ఐటి మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఎపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, తదితరులు మాట్లాడారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం