తెదేపాలో చేరేందుకు గిడ్డి ఈశ్వరి రెడీ


విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కోలాహలంగా మారింది. ఈశ్వరి ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. బహుశా మంగళవారం ఆమె అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవవచ్చని చెబుతున్నారు. పాడేరు ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు తరలి వెళ్లనున్నారని సమాచారం. వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో, స్థానిక ప్రజాప్రతినిధులతో ఈశ్వరి సమాలోచనలు జరిపారని వినికిడి. వైఎస్‌ఆర్‌ సిపి అధిష్ఠానం బుజ్జగింపు చర్యలు చేపట్టినా, స్వయంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం వచ్చి ఆమెతో చర్చించినా కూడా ఈశ్వరి తగ్గలేదని అంటున్నారు. ఆమె పార్టీ మారడం అయితే తథ్యమని, ఎప్పుడన్నది ఇంకా తేలలేదని అంటున్నారు.