శివాజీ విమానాశ్రయం ప్రపంచ రికార్డు


ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు గల 24 గంటల్లో ఒకే రన్‌ వే పై 969 విమానాల (టేకాఫ్‌, ల్యాండింగ్‌) ను హ్యాండిల్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పింది. నిర్వహణ పనుల కోసం ప్రతీరోజు రన్‌ వే ను ఒక గంటసేపు మూసి ఉంచాలనేది నిబంధన కావడంతో 23 గంటల్లోనే 969 విమనాలను నియంత్రించి రికార్డు సృష్టించినట్లు సుస్పష్టం. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సిబ్బంది సమన్వయం ప్రణాళికాబద్ధమైన కృషితో ఇది సాధ్యమైందని ఎయిర్‌ పోర్టు వర్గాలు తెలిపాయి. 2006 వరకు ముంబై విమానాశ్రయంలో గంటకు 30 విమానాల రాకపోకలు సాధ్యపడేవి. అంటే 24 గంటల్లో సుమారు 725 అన్నమాట. ఆ తరువాత రెండేళ్లలో ప్రధాన రన్‌ వేలో మార్పులు, ఆధునిక రాడార్, ఇతర సాంకేతిక పరికరాలవల్ల ఈ సంఖ్య 52 కి పెరిగింది. గతంలో 24 గంటల్లో 852 ఫ్లయిట్ల రాకపోకలు జరిగిన రికార్డులు నమోదై ఉన్నాయి. నిత్యం నడిచే వాటితో పాటూ అదనంగా విమానాల సంఖ్య పెరిగినా కూడా నియంత్రించే సామర్ధ్యం తమ ఎయిర్ పోర్టుకి ఉందని ఈ తాజా రికార్డు స్పష్టం చేసింది. గతంలో ఒక్కో విమానం ల్యాండింగ్‌ లేదా టేకాఫ్ కి నిమిషం పైగా టైం పట్టేదని ఇప్పుడది 48 సెకండ్లకు తగ్గిందని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు