హైదరాబాద్ మెట్రో... ధరల బాదుడే !

మెట్రో సదుపాయంగానే ఉంటుంది. అయితే ధరల పరంగా పోల్చుకోవడం అనవసరం. ఒకవేళ పోల్చుకుంటే మాత్రం గుండె దడ తప్పదు. ఎందుకంటే ఇపుడు హైదరాబాద్ మెట్రో చార్జీలు ప్రారంభంలోనే పీక్ స్టేజి లో ఉన్నాయి. ఇవి దిల్లీ, బెంగళూరు మెట్రోల కంటే కూడా ఎక్కువ. దిల్లీ మెట్రోలో ఐదు కిలోమీటర్ల ఛార్జి  రూ.15 .. అదే హైదరాబాద్‌ మెట్రోలో రూ.25 . దిల్లీ మెట్రోలో 12 కి.మీ.కి రూ.20, హైదరాబాద్‌లో రూ.40. దిల్లీలో 21 కి.మీ.కి రూ.30 కాగా హైదరాబాద్‌లో రూ.50. ఇక బెంగళూరు మెట్రోలో కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.48. ఇక్కడ 42 కి.మీ. దూరం మెట్రో తిరుగుతోంది. అంటే 42 కిలోమీటర్లకు అక్కడ 48 రూపాయలు చెల్లిస్తుంటే  హైదరాబాద్‌లో 26 కి.మీ. దాటితే చాలు రూ.60 సమర్పించాలి. అయితే మెట్రో చార్జీలు తెలంగాణ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే కాస్త  తక్కువ అని ఆనందపడాలి. మియాపూర్‌ నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులో అమీర్‌పేట వరకు రూ.48. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట మీదుగా ఉప్పల్‌ వరకు ఏసీ బస్సులు ఉన్నాయనుకుంటే కిలోమీటర్లను బట్టి రూ.96 వరకు ఉండొచ్చు. మెట్రోలో ఈ దూరానికి ఛార్జి  రూ.60. కాగా మియాపూర్‌ నుంచి నాగోల్‌ వరకు మెట్రోలో రానూపోనూ చార్జీలు రూ.120. మెట్రో స్టేషన్‌ నుంచి ఆరేడు కి.మీ.దూరంలో ఉండేవారు స్టేషన్‌కు బైక్ పై వచ్చి పార్కింగ్‌ చేస్తే పార్కింగ్‌ ఛార్జి రూ.30. మియాపూర్‌ నుంచి నాగోలులో మెట్రో దిగి మరో రెండు, మూడు కి.మీ.పని మీద వెళ్లి రావాలంటే ఆటోకు రూ.30. ఇలా మెట్రోలో మియాపూర్‌వాసి నాగోలు వెళ్లి రావడానికి మొత్తం రూ.180 అవుతుందని ఒక అంచనా. ఆర్టీసీ నాన్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఇదే దూరానికి ఒక్కొక్కరికి రూ.35 ఛార్జి పడుతోందని.. దీనిని బట్టి ఆర్టీసీ సర్వీసుల ఆదరణ ఏమాత్రం తగ్గదని ఒక అంచనా.