ఉద్యోగ రిజర్వేషన్లతో దేశానికి నష్టం - రఘురాం రాజన్

స్వల్పకాలిక రాజకీయ పరిష్కారమైన ఉద్యోగ రిజర్వేషన్లు దేశ వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాల్లో వివక్ష ఇప్పుడు పెద్ద సమస్య అని,  భారత్‌లోనూ ఈ సమస్య ఉందని అయన విదేశీ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.  ఆర్థిక ప్రగతికి రిజర్వేషన్ల వ్యవస్థ నష్టదాయకం అని, దీనికంటే కొత్త ఉద్యోగాలను సృష్టించడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్నా ప్రచారాన్ని రాజన్ ఖండించారు. తనకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. బోధనా వృత్తి ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. "ఇప్పుడు నేను ప్రొఫెసర్‌గా చాలా ఆనందంగా ఉన్నాను. రాజకీయాల్లోకి వద్దని  నా భార్య కూడా స్పష్టంగా చెప్పేసింది" అని రాజన్‌ అన్నారు.  

Facebook